● కొహెడ మార్కెట్ భూములపై తప్పుదోవ
● మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి
తుర్కయంజాల్: కొహెడ పండ్ల మార్కెట్ గురించి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తొర్రూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాత్రికిరాత్రి గడ్డి అన్నారం నుంచి మార్కెట్‌ను తరలించి రైతులు, వ్యాపారులను మోసం చేశారని తెలిపారు. 2020లో రూ.5 కోట్లు కేటాయించి తాత్కాలిక షెడ్‌లను వేస్తే ఒక్క గాలివానకే కొట్టుకు పొయిందని, డీపీఆర్ పేరుతో కమీషన్ మాట్లాడుకుని రూ. 1.25 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. 2011లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 178.09 ఎకరాల భూమిని కొహెడలో కేటాయించిందని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదన్నారు. ఈ భూమిని టీజీఐఐసీ కేటాయించడంలో ఎలాంటి చెడు ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ నిర్మాణం చేపడుతున్నందున, దానికి అనుబంధంగా ఉండేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ల నిర్మాణం చేపట్టాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. సర్వే నంబర్ 167 బై 1లోని భూములను ఏపీఐఐసీ నుంచి టీజీఐఐసీ బదలాయించారని, ఆ విషయం తెలుసుకోకుండా హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నామని, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ రెండు చోట్ల ఉన్న భూములను పరిశీలిస్తారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై అనుచిత వాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబమని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కర్ చారి, సభ్యులు బండి మధుసూదన్, పన్యాల జైపాల్ రెడ్డి, మేకం లక్ష్మి, గణేశ్‌నాయక్, మచ్చేందర్ రెడ్డి, రఘు పతి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నవరాజ్ పాల్గొన్నారు.


