● ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అధికారుల దాడులు
● 570 క్వింటాళ్ల నిల్వలు స్వాధీనం
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం పక్కదారి పడుతోంది. బియ్యాన్ని అక్రమంగా సేకరించి సన్నబియ్యంలా బహిరంగ మార్కెట్‌లో అమ్మడానికి సిద్ధం చేస్తుండగా అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. వీటిని ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని మంగళ్‌పల్లిలో పాడుబడ్డ గోదాంలో గుర్తించారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బియ్యం సేకరించి డీసీఎంలో తరలించి గోదాంలో నిల్వ చేస్తుండగా సమాచారం అందుకున్న స్టేట్ టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ డీఎస్పీ జివెంకటేశం ఆధ్వర్యంలో దాడులు చేశారు. మొత్తం 957 బస్తాల బియ్యం పట్టుబడ్డాయి. వీటిలో 570 క్వింటాళ్లు ప్రభుత్వం పంపిణీ చేసే సన్నబియ్యంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిల్వలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వనజాతకు అప్పగించారు. బియ్యం సీజ్ చేసి గోదాంలో భద్రపరిచారు. మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు నిల్వలు చూసి విస్తుపోయారు. బియ్యాన్ని తరలించడానికి వినియోగిస్తున్న రెండు డీసీఎంలను సీజ్ చేశారు. దందా నడిపిస్తున్నది నరేష్‌గా గుర్తించారు. కేసులు నమోదు చేసి విచారిస్తామని తెలిపారు.
తలంబ్రాల బియ్యం సైతం..
ఇటీవల సీతరామ కల్యాణం సందర్భంగా దేవాలయాల వద్ద వేసే తలంబ్రాల బియ్యం, వివాహ కార్యక్రమాల్లో వాడే అక్షింతలను సైతం వదల లేదు. వాటిని శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. గోదాంలో క్వింటాళ్ల కొద్ది తలంబ్రాల బియ్యం ఉన్నాయి.


