శంకర్‌పల్లి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు బాధిత రైతులతో మాట్లాడేందుకు బీఆర్‌ఎస్ అగ్రనాయకులు వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని ముందస్తు అరెస్టు చేసేందుకు శంకర్‌పల్లి బీడీఎల్ చౌరస్తా సమీపంలో మంగళవారం ఉదయం భారీగా మోహరించారు. సుమారు 50 మందికి పైగా శంకర్‌పల్లి, మోకిల పోలీసు సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలు సైతం వచ్చాయి. రోడ్డుపై బారీకేడ్లు ఏర్పాటు చేసి, హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేసి పంపించారు.
ఇబ్రహీంపట్నం రూరల్: అర్హులందరికీ డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు. మహేశ్వరం, మంకాల ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఇళ్లు లేవని పోరాటం చేస్తే ప్రభుత్వం, కోర్టు స్పందించాయని గుర్తు చేశారు. మంత్రుల ఆదేశాల మేరకు 15 మంది లబ్ధిదారులకు పట్టాలు జారీ చేశారన్నారు. మిగతా వారికి 80 శాతం పట్టాలు ఇవ్వగా 60 శాతం మందికి మాత్రమే తాళాలు ఇచ్చారన్నారు. అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లు ఇచ్చి వసతులు కల్పించాలని కోరారు. అనంతరం అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
చేవెళ్ల: జిల్లా స్థాయిలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన మాక్ ఐక్యరాజ్యసమితి సమావేశం పోటీలో చేవెళ్ల ఆదర్శ పాఠశాల విద్యార్థిని శశిరేఖ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో విద్యార్థినిని ప్రిన్సిపాల్ వినోద్‌కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థిని గైడ్ షహీనాబేగం తదితరులు పాల్గొన్నారు.


