ఏజెంట్ల నియామకంపై శ్రద్ధ తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

ఏజెంట్ల నియామకంపై శ్రద్ధ తీసుకోండి

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

వికారాబాద్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారి

అనంతగిరి: బూత్‌స్థాయి ఏజెంట్ల నియామకానికి రాజకీయ పార్టీలు సహకరించాలని వికారాబాద్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు. బుధవారం ప్రత్యేక ఇంటెన్సివ్‌ పునఃపరిశీలన(ఎస్‌ఆర్‌ఐ)లో భాగంగా బూత్‌స్థాయి ఏజెంట్ల నియామకం, మ్యాపింగ్‌ ప్రక్రియ, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు, మసక బారిన ఫొటోలు తదితర వాటిపై కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు ఉండొద్దన్నారు. జిల్లాలో 1,133 వార్డులు ఉన్నాయని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఏప్రిల్‌ 3వ తేదీ నాటికి ఏజెంట్ల జాబితాను సమర్పించాలని సూచించారు. గ్రామాల్లో బూత్‌స్థాయి అధికారులను సంప్రదించి బోగస్‌, డబుల్‌, మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు సహకరించాలన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వరి, డీఆర్‌ఓ మంగీలాల్‌, ఆర్డీఓలు వాసుచంద్ర, కె.అనిత, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ నైమత్‌ అలీ, తహసీల్దార్లు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన ఫలితాలు సాధించాలి

కుల్కచర్ల: పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారీ సూచించారు. బుధవారం చౌడాపూర్‌ ప్రాథమిక, జెడ్పీ పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అంతకుముందు ఫర్టిలైజర్‌ దుకాణాన్ని సందర్శించి ఎరువుల అమ్మకాల్లో నిబద్ధత పాటించాలని ఆదేశించారు. రేషన్‌ దుకాణంలో బియ్యం ఎందుకు తక్కువగా ఉన్నాయని కలెక్టర్‌ ఆరా తీయగా ఇంకా రావాల్సి ఉందని డీలర్‌ సమాధనం చెప్పారు. జెడ్పీ పాఠశాలలో కట్టెల పొయ్యిపై వంట తయారీని పరిశీలించి ఇలా చేయడం సరికాదని సూచించారు. కిచెన్‌షెడ్‌ మంజూరైనా ఎందుకు కట్టలేదని అధికారులను ప్రశ్నించారు. వెంటనే పనులు ప్రారంభించాలని సర్పంచ్‌ నవీన్‌కు సూచించారు. గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల నిర్వహించాలి కొత్తగా ఏర్పాటైన చౌడాపూర్‌ మండల కేంద్రానికి ప్రాథమిక పాఠశాల మంజూరు కాగా గ్రామం బయట ఉన్న జెడ్పీ పాఠశాలలోకి మార్చారు. పిల్లలను అంత దూరం పంపడం కష్టాంగా ఉందని తల్లిదండ్రులు కలెక్టర్‌కు విన్నవించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సోమలింగం, ఎంఈఓ రాంచందర్‌, ఇన్‌చార్జ్‌ ఎంపీఓ రాజిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement