అయ్యప్ప దీక్ష.. మోక్షదాయకం
స్థానికం
షాబాద్: జ్యోతిస్వరూపుడు, శక్తిస్వరూపుడు.. హరిహరసుతుడు.. పంచగిరీశుడు.. మంగళమూర్తి.. అయ్యప్ప స్వామి దీక్ష అందరికీ మోక్షదాయకం. స్వామియే శరణం అంటూ ఘోషించే అయ్యప్ప నామస్మరణ శుభదాయకం. పదునెనిమిది మెట్లపై పరమభక్తితో తరించిన వారి జన్మ ధన్యం ఇలలో.. అంటూ భక్తులు మాలధారణకు సిద్ధమవుతున్నారు. స్వామి శరణుఘోషల మధ్య దీక్షను స్వీకరించి, కఠోర బ్రహ్మచర్యాన్ని అవలంభిస్తున్నారు. దీక్షతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
కఠోర దీక్షతో పూజలు
ఏటా కార్తీక మాసంలో హిందువులు అయ్యప్ప దీక్షను స్వీకరిస్తుంటారు. ఈ క్రమంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో భక్తులు అధిక సంఖ్యలో మాల ధరిస్తుంటారు. దేవతా మూర్తులు అభయముద్దలో ఉంటారన్న నమ్మకంతో.. ఈ మాసంలో జరిపే పూజలకు ఎంతో విశిష్టత ఉంటుంది. అందుకే భక్తులు కఠోర దీక్షతో పూజలు చేస్తుంటారు.
వెయ్యి మంది భక్తులు
షాబాద్ మండలంలో ఈ ఏడు సుమారు వెయ్యి మందికి పైగా భక్తులు మాలధారణ చేయనున్నట్లు సమాచారం. 41 రోజులు దీక్షను పూర్తి చేసిన వారికి.. ఇరుముడిని గురుస్వామి కడతారు. వారిఆధ్వర్యంలో జరిగే మహాపడి పూజల్లో భక్తులు.. భజనా భక్తిపరవశంతో ఉంటారు. అయ్యప్పకీర్తనలు ఎంతటి హేతువాదినైనా క్షణాల్లో భక్తిపారవశ్యంతో మునిగిపోయేలా చేస్తాయి.అనంతరం అన్నదానం చేస్తారు.
ఫలితాలు
అయ్యప్ప దీక్ష వలన సమాజంలోని కులమత బేధాలు, పేద, ధనిక తారతమ్యాలు కనిపించవు. ఉపవాసం ఉండడం వలన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. దీనివలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉపవాసాల వలన రక్తం, జీర్ణవ్యవస్థ శుద్ధి అవుతాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. గంధం, కుంకుమ, విభూతి, తులసిమాల ధరించ డం వలన నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. పూజలు, భజనల తో మానసిక రోగాలు తొలగిపోతాయి. దురల వాట్లకు దూరమై.. భక్తి భావాలు పెరుగుతాయి. శబరిమలలో చిన్నపాదం, పెద్దపాదం ద్వారా అయ్యప్ప సన్నిధిని చేరుకొని, స్వామివారిని దర్శించుకుంటే జన్మ ధన్యమైనంత తృప్తి కలుగుతుంది.
దీక్షలు ఇలా..
● మొదటిసారి కన్యస్వామి
● రెండోసారి కత్తిస్వామి
● మూడోసారి గంటస్వామి
● నాలుగోసారి గదస్వామి
● ఐదోసారి పెరుస్వామి
● ఆరోసారి గురుస్వామి
● ఏడు, అంతకన్నా ఎక్కువసార్లు
పెరుగురు స్వాములు
● 18 సార్లు, అంతకన్నా ఎక్కువసార్లు
నారికేళ స్వాములు
కావాల్సిన సామగ్రి
అయ్యప్ప దీక్షను తీసుకొనేవారు తెల్లవారక ముందే సామగ్రితో గురుస్వామివద్దకు వెళ్లి మాలధారణ చేసుకోవాలి. తల్లిదండ్రుల చేతులమీదుగా కూడా చేసుకోవచ్చును. ఇందుకు కావాల్సిన సామగ్రి.. నల్ల చొక్కాలు, నల్ల కండువాలు, నల్ల లుంగీలు, ప్యాంట్లు, తులసిమాల, రుద్రాక్ష మాల, అయ్యప్పస్వామి ముద్ర, కొబ్బరికాయలు, అరటిపండ్లు, నువ్వులనూనె, అగర్‌బత్తీలు, గంధపు పొడి, విభూతి, కుంకుమ, జీడిపప్పు, కిస్మిస్, పటిక, పంచదార, కర్పూరం.
ప్రజల్లో పెరుగుతున్న భక్తిభావం
మాలధారణకు
ఆసక్తి చూపుతున్న వైనం
మణికంఠుడి సేవలో భక్తజనం
కార్తీక మాసం నుంచి ప్రారంభం
భక్తి భావంతో ఉండాలి
మాల ధరించిన వారు 41 రోజులు(మండల కాలం) స్వామిని పూజిస్తూ భక్తి భావంతో మెలగాలి. స్వామియే శరణం అయ్యప్ప అంటూ దైవ చింతనతో గడపాలి. చెప్పులు లేకుండా నడవడం వలన రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. 25 ఏళ్లుగా మాల ధరిస్తున్నాను.
– రవీందర్‌గౌడ్, గురుస్వామి, షాబాద్
మధురానుభూతి
అయ్యప్ప సేవలో తీయని అనుభూతి కలుగుతుంది. 20 ఏళ్లుగా మాల ధరిస్తున్నాను. ఆరోగ్య పరిరక్షణతో పాటు ఆర్థికంగా కలిసి వస్తోంది. ఇదంతా ఆయన మహిమే. మండలంలో నూతనంగా దేవాలయాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నాం.
– వెంకటేశ్, గురుస్వామి, నాగర్‌గూడ
ఆరోగ్యానికి మేలు
అయ్యప్ప మాలధారణ వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. సూర్యోదయం కన్నా ముందు, సూర్యాస్తమయం తరువాత రోజుకు రెండు సార్లు స్నానం, ఒకపూట భోజనం చేయడం వలన ఉల్లాసం పెరుగుతుంది. ఏటా క్రమం తప్పకుండా దీక్ష తీసుకుంటున్నాను.
– అవినాశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ, షాబాద్
శవయాత్రలు ఎదురైతే..
అయ్యప్ప భక్తులు.. ఉదయం, సంధ్యవేళలో చన్నీటి స్నానాలు ఆచరించి, ఒకపూట భోజనంతో కటిక నేలపై నిద్రించాలి. రుతు సీ్త్రలు, శవయాత్రలు ఎదురైతే వెంటనే తలస్నానం ఆచరించి, స్వామివారికి హారతి ఇచ్చి శరణుఘోష చెప్పు కోవాలి. సూర్యుడు ఉదయించే వైపు తిరిగి మూత్ర విసర్జన చేయరాదు. మాలధారణ చేసిన వ్యక్తి.. తన భార్యను అయినా సరే మాళిగాపురం మాత అంటూ పిలవాల్సి ఉంటుంది. మాలధారణ చేయించే గురుస్వామిని భక్తితో పూజించాలి.
అయ్యప్ప దీక్ష.. మోక్షదాయకం
అయ్యప్ప దీక్ష.. మోక్షదాయకం
అయ్యప్ప దీక్ష.. మోక్షదాయకం


