
చికిత్స పొందుతూ గర్భిణి మృతి
మంచాల: చికిత్స పొందుతూ గర్భిణి మృతి చెందింది. ఆమె మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మంచాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన పంతంగి మానస (26) ఏడు నెలల గర్భిణి. వైద్యం కోసం భర్త మధుతో కలిసి శుక్రవారం ఉదయం మంచాల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చింది. అక్కడి వైద్యురాలు పరీక్షించి బలం తక్కువగా ఉందని, గ్లూకోజ్ ఎక్కించారు. కొద్ది సేపటికే ఆమె లోబీపీతో స్పృహ తప్పిపడిపోయింది. దీంతో వెంటనే ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నగరంలోని కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఉస్మానియా వైద్యశాలకు పంపించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆమె మృతి చెందింది.
న్యాయం చేయాలంటూ..
మంచాల ప్రభుత్వ ఆస్పత్రి నిర్లక్ష్యంతో మానస మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, తమరే న్యాయం చేయాలంటూ మంచాల– ఆరుట్ల రోడ్డుపై బైఠాయించారు. వారికి వివిధ పార్టీల నాయకులు మద్దతుగా నిలిచారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని ఫోన్‌లో కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అక్కడికి వచ్చిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధామాధవి వారి సర్ది చెప్పారు. రూ.లక్ష అందిస్తామని తెలిపారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన

చికిత్స పొందుతూ గర్భిణి మృతి