విద్యార్థులే దేశ నిర్మాతలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులే దేశ నిర్మాతలు

Oct 19 2025 8:26 AM | Updated on Oct 19 2025 8:26 AM

విద్య

విద్యార్థులే దేశ నిర్మాతలు

మొయినాబాద్‌: దేశ భవిష్యత్తును నిర్మించేది విద్యార్థులేనని న్యూఢిల్లీ యూజీసీ జాయింట్‌ సెక్రటరీ గోపిచంద్‌ మేర్గు అన్నారు. అరిస్టాటిల్‌ పీజీ కళాశాలలో శనివారం 21వ పట్టభద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 2025 బ్యాచ్‌కు చెందిన 170 మంది ఎంబీఏ స్టూడెంట్లకు పట్టాలు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎస్‌.కావ్య, కె.అర్చనకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధి బాబురావు ఘాట్లమనేని, ప్రిన్సిపల్‌ ఎల్‌.శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

అబ్దుల్లాపూర్‌మెట్‌ : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా యెర్కారం గ్రామానికి చెందిన బొర్ర నరేష్‌ (22) కొంతకాలంగా కుటుంబసభ్యులతో కలిసి నగరంలోని షేక్‌పేట మండలం ఫిల్మ్‌నగర్‌లో నివసిస్తున్నాడు. కాలుష్య తనిఖీ వాహనంలో పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం తాను దుబాయ్‌ వెళ్తున్నానని, తన ఫోన్‌ కలవదని చెప్పి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. నరేష్‌ కనిపించడం లేదంటూ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ సెప్టెంబర్‌ 30న సోదరుడు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మండల పరిధిలోని కవాడిపల్లి గ్రామ శివారులో ఉన్న పెద్దగుట్టపై శనివారం ఉదయం ఓ చెట్టుకు యువకుడి మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ లభించిన సెల్‌ఫోన్‌ ఆధారంగా అతని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడి సోదరుడు నవీన్‌ పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

దుండిగల్‌: డీసీఎం వ్యాన్‌ ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది..పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శనివారం సాయంత్రం గండిమైసమ్మ చౌరస్తాలోని డీపోచంపల్లి యూటర్న్‌ వద్ద బైక్‌పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న దుండిగల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి జేబులో దొరికిన ఆధార్‌ కార్డు ఆధారంగా అతడిని అన్నారం గ్రామానికి చెందిన కుమారస్వామి(38)గా గుర్తించారు. డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్‌..

రెండు యూట్యూబ్‌ చానళ్లపై కేసులు నమోదు

సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని.. ఏ తరహా కంటెంట్‌ అయినా చేస్తామంటే కుదరదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్‌ చేసిన రెండు యూట్యూబ్‌ చానళ్లపై హైదరాబాద్‌ సైబర్‌ క్రై మ్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వ్యూస్‌, లైక్స్‌ తో పాటు సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావడం కోసం చిన్నారులతో అసభ్యకర కంటెంట్‌ చేయకూడదన్నారు. ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదని చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇలాంటి చర్యలు చేసే వారిపై పోక్సో, జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ తదితర చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి వీడియోలు దృష్టికి వస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఓటరు జాబితాపై తప్పుడు ప్రచారంవ్యాప్తి చేస్తున్న వ్యక్తిపై కేసు

ఫిలింనగర్‌: ఓటరు గుర్తింపు కార్డులో తప్పుడు చిరునామాలు, రాజకీయ నాయకుల పేర్లు, ఫొటోలు మార్ఫింగ్‌ చేసి అసత్య ప్రచారం చేయడమే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చేస్తున్న వ్యక్తిపై ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాడని, సామాజిక మాధ్యమాల్లో ఓటరు జాబితాపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం యూసుఫ్‌గూడ సర్కిల్‌–19 అసిస్టెంట్‌ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ బాలరాజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థులే దేశ నిర్మాతలు 1
1/1

విద్యార్థులే దేశ నిర్మాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement