
జిమ్ నిర్వాహకుడిపై కేసు
సాక్షి, సిటీబ్యూరో: మందుల తయారీ, నిల్వలు, వినియోగంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ సాహ్నావాజ్‌ఖాసిం అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ పరిధిలోని నామాలగుండులో ఓ జిమ్‌పై దాడులు నిర్వహించిన అధికారులు పెద్ద మొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచిన మెఫెంటైర్మెన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు స్వాదీనం చేసుకున్నారు. కార్డియాక్ స్టిమ్యులేట్ అవసరాలకు వినియోగించే మందును జిమ్‌లో బాడీ బిల్డర్స్‌కు అక్రమంగా విక్రయిస్తున్నారని గుర్తించారు. దీంతో జిమ్ నిర్వాహకుడు నరేష్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. దాడుల్లో డి.సరిత, గోవింద్ సింగ్, రేణుక, సురేంద్రనాథ్ పాల్గొన్నారు.
నిమ్స్‌లో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం
లక్డీకాపూల్ : ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైన సంఘటన శనివారం నిమ్స్ మార్చురీ సమీపంలోని స్టాఫ్ పార్కింగ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే ఆస్పత్రిలో పని చేస్తున్న అన్‌స్కిల్డ్ వర్కర్ బాలచందర్ తన ఈవీ బైక్‌ను స్టాఫ్ పార్కింగ్‌లో పార్క్ చేసి విధులకు హాజరయ్యాడు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పార్క్ చేసిన వాహనం నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్రమత్తమైన నిమ్స్ సెక్యూరిటీ అధికారి రామారావు వాహనాన్ని సిబ్బంది సహయంతో స్టాఫ్ పార్కింగ్ నుంచి బయటకి తీయించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ వాహనం నుంచి ఒక్కసారిగా మంట లు వ్యాపించడంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది.