
కల్వకుర్తిని సస్యశ్యామలం చేస్తాం
ఆమనగల్లు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తి నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కేఎల్‌ఐ డీ82 కాలువ ద్వారా ఆమనగల్లు, మాడ్గుల, వెల్దండ మండలాల పరిధిలోని 35వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆమనగల్లు పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో శుక్రవారం కేఎల్‌ఐ డీ82 కాలువ భూ నిర్వాసితులకు ప్రభుత్వం ద్వారా రెండో విడత మంజూరైన రూ.2.50 కోట్ల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధి, సాగునీటి కల్పనకు పెద్దపీట వేస్తోందని అన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. కేఎల్‌ఐ డీ 82 కాలువ భూ నిర్వాసితులకు పరిహారం అందించకుండా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక పరిహారం డబ్బులు విడుదల చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మార్కెట్ చైర్‌పర్సన్ యాట గీత నర్సింహ, టీపీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ మాజీ చైర్మన్ బట్టు కిషన్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ అధికారులు ఏఎస్‌ఎన్‌రెడ్డి, శ్రీకాంత్, దేవన్న, తిరుపతయ్య, తహసీల్దార్ ఫయీంఖాద్రి, సీఐ జానకీరాంరెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి