ఆమనగల్లు: ఆమనగల్లులో ఏసీపీ కార్యాలయం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుజ్జల మహేశ్, రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్ అలీలు డీజీపీ బి.శివధర్‌రెడ్డిని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. శుక్రవారం ఇరువురు నగరంలోని డీజీపీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు.
ఆటో ఢీ, ఒకరి మృతి
శంకర్‌పల్లి: ఆటో ఢీ కొన్న ప్రమాదంలో పాద చారి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం మోకిల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్జాగూడకు చెందిన శంకర్ సింగ్(48) అవివాహితుడు. తల్లిదండ్రులు మరణించడంతో అన్న ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సదరు వ్యక్తి.. మిర్జాగూడ గేట్ నుంచి హైదరాబాద్ వైపు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో శంకర్‌పల్లి నుంచి నగరం వైపు వెళ్తున్న ఆటో.. శంకర్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆయన తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
ఏసీపీ కార్యాలయం ఏర్పాటు చేయండి