
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
● ఏపీ పోలీసుల కేసులపై ముక్తకంఠంతో ఖండన
● ఎడిటర్, పాత్రికేయులకు వెల్లువెత్తుతున్న సంఘీభావం
సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పత్రికా స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరు పత్రికల గొంతునొక్కడమేనని అభిప్రాయపడ్డారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్‌ఛార్జి, రిపోర్టర్లపై ఏపీ ప్రభుత్వ ప్రోద్బలంతో అక్కడి పోలీసులు కేసులు పెట్టి ఆఫీసుకు వచ్చి నోటీసులు అందజేయడంపై వారు మండిపడ్డారు. పత్రికలో వచ్చిన కథనాలపై అభ్యంతరాలుంటే ఖండించడం, వివరణ ఇవ్వడం చేయాలి గానీ ఏకంగా కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
కేసుల నమోదు హేయనీయం
సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం హేయనీయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛపై అందరికీ గౌరవం ఉండాలి. అది లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణిస్తున్నాం.
– వీర్లపల్లిశంకర్, ఎమ్మెల్యే, షాద్‌నగర్
కక్షపూరిత చర్యలు తగవు
పత్రికా స్వేచ్ఛను హరించాలని చూస్తే సహించేదిలేదు. ప్రజా సమస్యలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి, జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం. పత్రికాస్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించేలా కక్షపూరితంగా వ్యవహరించడం తగదు.
– పగడాల యాదయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి
సమాజం హర్షించదు
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం సరైంది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పులను ఎత్తి చూపుతున్న జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రచురించిన వార్తపై ఏదైనా అభ్యంతరం ఉంటే ఖండించడం, వివరణ ఇవ్వడం చేయాలి కానీ రాసిన విలేకరులపై కేసులు పెట్టడం సరి కాదు. పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. ఇలాంటి చర్యలను సమాజం హర్షించదు.
– సబితారెడ్డి, ఎమ్మెల్యే, మహేశ్వరం
జర్నలిస్టులపై కేసులు దారుణం
పత్రికా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని హరించడమే. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసి పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం దారుణం. అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవిగితే ఎంతటి వారికి అయినా పతనం తప్పదు. నియంతలా వ్యవహరించిన ఎంతో మంది కాల గర్భంలో కలిసి పోయారు.
– ఓరుగంటి యాదయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు
ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమే. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించడమే. విలేకరుల సమావేశంలో ఒక వ్యక్తి పేర్కొన్న అంశాలను ప్రచురిస్తే కేసులు పెట్టడం సరైంది కాదు. పత్రికాస్వేచ్ఛ విషయంలో సమాజంలోని అన్ని వర్గాలు గౌరవ దృక్పథం కలిగి ఉండాలి. ప్రెస్‌మీటర్ వార్తలను ప్రచురించిన సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకునే వరకు వెళ్లడం పత్రికా స్వేచ్ఛకు కళ్లెం వేయడం లాంటిదే.
– మైల సైదులు, జిల్లా కార్యదర్శి, టీడబ్ల్యూజేఎఫ్