
యూరియా అవస్థలు
నందిగామ: యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగిన ఘటన మండల పరిధిలోని చేగూరు పీఏసీఎస్‌లో చోటుచేసుకుంది. చేగూరు పీఏసీఎస్‌కు గురువారం 250 బస్తాల యూరియా వచ్చింది. రైతులకు ఏ మాత్రం సరిపోక పోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పి పంపించారు. మేకగూడలోని పీఏసీఎస్‌కి 450 బ్యాగులు రాగా రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అందరికీ అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
గంటల తరబడి క్యూ
ఇబ్రహీంపట్నం: శేరిగూడలోని ఉప్పరిగూడ పీఏసీఎస్‌కు గురువారం 20 టన్నుల యూరియా వచ్చింది. వందలాది మంది రైతులు క్యూ లైన్‌లో నిలుచుకున్నారు. సీఐ మహేందర్‌రెడ్డి వాటర్ బాటిల్స్ తెప్పించి క్యూలైన్‌లో ఉన్న వారికి అందజేశారు. రెండు గంటల్లోనే వచ్చిన స్టాక్ అయిపోయింది. అందని వారు ఉసూరుమంటూ వెనుదిరిగారు.
పోలీసు భద్రత మధ్య పంపిణీ
అబ్దుల్లాపూర్‌మెట్: మండల కేంద్రంలోని బాటసింగారం రైతు సేవా సహకార సంఘానికి గురువారం 225 యూరియా బస్తాలు వచ్చాయి. తోపులాటలు జరుగుతాయన్న ఉద్దేశంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల భద్రత మధ్య బస్తాలను గోదాంలోకి దింపారు. అనంతరం మండల వ్యవసాయశాఖ అధికారి పల్లవి, సహకార సంఘం మేనేజర్ జక్కుల ఐలేష్‌యాదవ్ రైతులకు అందజేశారు.