
పెట్రోల్‌లో నీళ్లు.. ఆగమైన వాహనాలు
ఇబ్రహీంపట్నం: పెట్రోల్‌తో పాటు నీళ్లు రావడంతో ఓ కారు మొరాయించి ఇంజన్ పాడయింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. శేరిగూడ శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఉన్న హెచ్‌పీ బంక్‌లో మహేశ్ తన కారులో పెట్రోల్ పోయించాడు. శుక్రవారం కారు మొరాయించడంతో మెకానిక్ వాహనాన్ని పరిశీలించి ఇంజన్ పాడయిందని తెలిపాడు. దీంతో మహేశ్ బంక్‌కు వచ్చి పరిశీలించగా పెట్రోల్‌తోపాటు నీరు వచ్చింది. దీంతో బంక్ సిబ్బందికి, అక్కడకు వచ్చినవారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గతంలోనూ ఇదే బంక్‌లో నీళ్లు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వినియోగదారులు ఆరోపించారు.
చర్యలు తీసుకుంటాం
వర్షాలు కురవడం.. పెట్రోల్ నిల్వ ఉండే ట్యాంకులు నాణ్యత లోపించడం తదితర కారణాలతో నీరు చేరే అవకాశం ఉంటుంది. సరిచేసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంటుంది. వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలను అందించకుంటే చర్యలు తప్పవు. వర్షకాలంలో నాజిల్‌ను పైకెత్తి వాహనాలకు పెట్రోల్ పొయించుకుంటే అందులో ప్యూయల్ వస్తుందా, నీరు వస్తుందా గమనించవచ్చు.
– మాచన రఘునందన్, పౌరసరాఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ