
మూసీలోకి పోటెత్తిన వరద
సాక్షి, సిటీబ్యూరో/బండ్లగూడ: మూసీ నదిలో భారీగా వరద ప్రవాహం పెరిగింది. జంట జలాశయాల గేట్లు నాలుగు అడుగుల చొప్పున ఎత్తి దిగువ భాగాన భారీగా జలాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారగా, ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం తెల్లవారు జామున నుంచి భారీగా వరద ప్రవాహం పెరిగింది. రెండు జలాశయాలాకు 2,300 క్యూసెక్కుల నుంచి 5,500 క్యూసెక్కుల వరకు వరద వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తి అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీలో వరద ప్రవాహం పెరగడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నివాసాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. హిమాయత్‌సాగర్ నుంచి రాజేంద్రనగర్ వెళ్లే ఔటర్ సబ్ రోడ్డుపై వరద భారీగా ప్రవహిస్తుండటంతో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. ఉస్మాన్‌సాగర్ జలాశయం 6 క్రస్ట్ గేట్లు ఎత్తడంతో మంచిరేవుల నుంచి నార్సింగి వెళ్లే దారిపై వరదనీరు రావడంతో ఆ రోడ్డుపై కూడా రాకపోకలు నిలిపివేశారు.