
భూములున్నాయ్.. కొంటారా?
న్యూస్‌రీల్
ఒకప్పుడు హాట్‌కేకుల్లా..
శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంచుమించు రెండేళ్ల విరామం తరువాత భూములను వేలం వేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) రంగం సిద్ధం చేసింది. నగరంలోని తుర్కయంజాల్, బాచుపల్లిల్లో ఉన్న ప్లాట్‌లను ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ రెండు చోట్ల నిర్వహించిన ప్రీబిడ్డింగ్ సమావేశంలో కొనుగోలుదార్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. సాధారణంగా హెచ్‌ఎండీఏ స్థలాల కోసం ఏర్పాటు చేసే ప్రీబిడ్ సమావేశాల్లోనే కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసక్తులను వ్యక్తం చేస్తారు. సందేహాలను నివృత్తి చేసుకుంటారు. కానీ.. ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశాల్లో అలాంటి ఆసక్తి కనిపించలేదు. అతి తక్కువ సంఖ్యలో కొనుగోలుదారులు పాల్గొన్నట్లు అధికారులు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో నిర్వహించే ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు ఏ మేరకు స్పందన ఉంటుంద నేది సందేహాస్పదంగా మారింది. బిడ్డింగ్ నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థలాలపై విస్తృత ప్రచారం కూడా చేపట్టారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న స్తబ్ధత దృష్ట్యా అధికారుల్లోనూ డైలమా నెలకొంది,
ధరలు ఎక్కువే...
రెండు చోట్ల హెచ్‌ఎండీఏ నిర్ణయించిన బేసిక్ ధరలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుర్కయంజాల్‌లో చదరపు గజానికి రూ.65,000, బాచుపల్లిలో రూ.70,000 చొప్పున ధర నిర్ణయించారు. ప్రస్తుత స్తబ్ధత కారణంగా మార్కెట్ ధరల కంటే ఎక్కువే ఉన్నట్లు కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. ‘తుర్కయంజాల్‌లో ప్రస్తుతం గజానికి రూ.40,000 నుంచి రూ.45,000 వరకు ఉంది. కానీ హెచ్‌ఎండీఏ రూ.65,000 వరకు పెంచింది. దీంతో కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు’ అని తుర్కయంజాల్‌కు చెందిన రియల్టర్ ఒకరు చెప్పారు. ఇక్కడ మొత్తం 12 ప్లాట్‌లను విక్రయించేందుకు నోటిఫికేషన్ వెలువరించారు. ఒక్కో ప్లాట్ కనిష్టంగా 600 గజాల నుంచి 1,146 గజాల వరకు ఉంది. ప్లాట్ సైజులు నాలుగు వైపులా సమంగా లేకపోవడంపై కూడా పలువురు పెదవి విరుస్తున్నారు. కొన్ని స్థలాలకు క్రాసింగ్‌లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో భవన నిర్మాణాలకు అనుకూలంగా ఉండకపోవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. తుర్కయంజాల్‌లోని ప్లాట్‌లకు ఈ నెల 17న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించనున్నారు. కొనుగోలుదారులు 16వ తేదీ సాయంత్రం వరకు రూ.1,180 చెల్లించి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
బాచుపల్లికి స్పందన కరువే..
బాచుపల్లిలో ఉన్న 70 ప్లాట్‌లకు ఈ నెల 18న ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు దఫాలుగా వేలం నిర్వహించనున్నారు. ఉదయం 35 ప్లాట్‌లు, మధ్యాహ్నం 35 ప్లాట్‌లకు బిడ్డింగ్ ఉంటుంది. ఈ నెల 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ సదుపాయం ఉంది. ఈ స్థలాల కోసం నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లోనూ 30 మంది లోపే కొనుగోలుదారులు తమ ఆసక్తిని చూపడం గమనార్హం. ఈ స్థలాలకు గజానికి రూ.70,000 చొప్పున ధర నిర్ణయించారు. స్థానికంగా ఉన్న మార్కెట్ ధరల కంటే ఎక్కువేననే అభిప్రాయం ఉంది. చాలా వరకు మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేందుకు అనుకూలంగా ఉన్నాయి. కనిష్టంగా 266.67 గజాల నుంచి గరిష్టంగా 499.96 గజాల వరకు ఈ ప్లాట్ సైజ్‌లు ఉన్నాయి. ఈ లే అవుట్‌కు అప్రోచ్ రోడ్ లేకపోవడం కూడా ఒక లోపంగా ఉన్నట్లు ప్రీబిడ్డింగ్‌లో పాల్గొన్న కొందరు చెప్పారు. మరోవైపు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు చోట్ల మిగిలిపోయిన హెచ్‌ఎండీఏ స్థలాలకు ఈ నెల 19న బిడ్డింగ్ నిర్వహించనున్నారు.
హెచ్‌ఎండీఏ ప్లాట్‌లు ఒకప్పుడు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కోకాపేట్‌లో ఎకరం రూ.కోటికిపైగా అమ్ముడు కాగా, మోకిలాలో గజానికి రూ.లక్షకుపైగా ధర పలికింది. బుద్వేల్‌లోనూ అనూహ్యమైన స్పందన లభించింది. ఉప్పల్ భగాయత్, బోడుప్పల్, మేడిపల్లి, హయత్‌నగర్, బాచుపల్లి, తుర్కయంజాల్, తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున అమ్ముడయ్యాయి. భూముల అమ్మకాలపైన ప్రభుత్వా నికి రూ.వేల కోట్ల ఆదాయం లభించింది. అన్ని మౌలిక సదుపాయాలతో లే అవుట్‌లను రూపొందించడం, ఎలాంటి వివాదాలు లేకపోవడం, బ్యాంకుల నుంచి సత్వరమే రుణసదుపాయం లభించడం వంటి వివిధ కారణాల దృష్ట్యా కొనుగోలుదారులు ఆసక్తి చూపారు. ఇప్పటికీ హెచ్‌ఎండీఏ స్థలాలపైన ప్రజల్లో నమ్మకం ఉన్నప్పటికీ ప్రస్తుత మార్కెట్ స్తబ్దత, అధికధరలు, అడ్డదిడ్డంగా ఉన్న ప్లాట్ సైజులు, రోడ్డు సదుపాయం లేకపోవడం వంటి అంశాలు బిడ్డింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ నెల 17 నుంచి హెచ్‌ఎండీఏ స్థలాలకు ఆన్‌లైన్ బిడ్డింగ్
ప్రీబిడ్ సమావేశాల్లో కొనుగోలుదారుల నుంచి స్పందన శూన్యం
తుర్కయంజాల్, బాచుపల్లిలోవిక్రయాలకు సన్నాహాలు
తుర్కయంజాల్‌లో 12, బాచుపల్లిలో 70 ప్లాట్లు సిద్ధం