
దేశానికి కీర్తిప్రతిష్టలు తేవాలి
శంకర్‌పల్లి: బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి, దేశానికి పేరు ప్రతిష్టలు తేవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.సుబ్రమణియన్ అన్నారు. దొంతన్‌పల్లిలోని ఇక్ఫాయ్ డిమ్డ్ యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ కోర్సుల్లో డిగ్రీలు పొందిన 3,947 మందికి పట్టాలు అందజేశారు. మాజీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేశవపరాశన్, సున్నా బడ్జెట్‌తో వ్యవసాయం చేస్తున్న పద్మశ్రీ సుభాష్ పాలేకర్, హెచ్‌డీఎఫ్‌సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్‌కు యూనివర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ వి.సుబ్రమణియన్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ చిన్నతనం నుంచే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. జీవితంలో పైకి ఎదగడంతో పాటు వ్యక్తిత్వాన్ని సైతం సమస్థాయిలో పెంపొందించుకోవాలన్నారు. కళాశాల చాన్స్‌లర్, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ మాట్లాడుతూ.. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, దీనికి ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేస్తూ, దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చాన్సలర్ కోటిరెడ్డి, రిజిస్ట్రార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సుబ్రమణియన్