
బీహార్ ఎన్నికల కోసమే జీఎస్టీ తగ్గింపు
ఇబ్రహీంపట్నం: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందని.. ప్రజలపై మమకారంతో కాదని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం జాతీయ నాయకుడు నర్సిరెడ్డి విమర్శించారు. సీపీఎం జాతీయ మాజీ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్థంతి సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనుధర్మ శాస్త్రం అమలుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం దోపిడీ వర్గాలకు కొమ్ముకాస్తోందన్నారు. ఇందుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలలో విఫలమైందని విమర్శించారు. సీతారాం ఏచూరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అట్టడుగువర్గాలకోసం పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యదర్శివర్గ సభ్యులు సామేల్, నర్సింహ, జగన్, సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, రావుల జంగయ్య, అంజయ్య, నర్పింహ, సీహెచ్ జంగయ్య, సీహెచ్ బుగ్గరాములు, పి.జగన్, ఎల్లేశ్, పురుషోత్తం, వెంకటేశ్, రాజు, విఘ్ణేశ్, శారద, అరుణ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి