
పదవులకు అప్పు ముప్పు!
ఆదర్శంగా ఉండాలి
యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో డైరెక్టర్లుగా ఉన్నవారు నిబంధనల ప్రకారం రైతుల మాదిరిగానే రుణాలు పొందే అవకాశం ఉంటుంది. పీఏసీఎస్‌ల్లో పొందిన వ్యక్తిగత రుణాలను ప్రతి మూడు నెలలకోసారి, స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను ప్రతి ఆరు నెలలకోసారి చెల్లించాల్సి ఉంటుంది. కానీ అప్పు తీసుకున్నవారంతా పదవీ పలుకుబడితో ఏళ్లుగా బకాయి చెల్లించకుండా మొండికేశారు. ఈ క్రమంలో సర్కార్ ఆదేశాల మేరకు తాజాగా జిల్లాలోని 37 పీఏసీఎస్‌ల్లో తొమ్మిది చైర్మన్ల పవర్ కట్ చేసిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మూడేళ్లకు మించి బకాయి చెల్లించని వారిని పదవిలోంచి తప్పించే విధంగా దృష్టి సారించారు. అప్పులు వసూలు చేయని పీఏసీఎస్‌ల కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.
అప్పుల వివరాలు సేకరణ
జిల్లాలోని 37 పీఏసీఎస్‌ల్లో ప్రతి పీఏసీఎస్‌కు 13 మంది డైరెక్టర్ల (వీరిలో ఒకరు చైర్మన్‌గా ఉంటారు) చొప్పున మొత్తంగా 481 మంది ఉన్నారు. వీరంతా 2020 ఫిబ్రవరి 15న ఎన్నికయ్యారు. ఏ పీఏసీఎస్‌లో ఏ డైరెక్టర్ ఎంత రుణం పొందారు.. వ్యక్తిగత రుణాలా.. లేక పంట రుణాలా.. బినామీల పేర్లపై పొందారా.. అనే వివరాల నివేదికను అందజేయా లని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు కార్యదర్శులను ఆదేశించారు. ఆరు నెలల క్రితమే ఆన్‌లైన్ ద్వారా మొండి బకాయిదారుల వివరాలు ప్రాథమికంగా సేకరించారు. తాజాగా పూర్తి స్థాయి లో రుణాలు పొందిన వివరాలు, అప్పు మొత్తం, వడ్డీ బకాయి, వసూలు కోసం చట్టపరంగా తీసుకున్న నిర్ణయాలపై వివరాలు అడిగినట్లు తెలిసింది.
పదవీ పలుకుబడితో..
పీఏసీఎస్‌ల్లో రుణాలు పొందిన డైరెక్టర్లు పదవీ పలుకుబడితో బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. కార్యదర్శులు బకాయిల కోసం ఒత్తిళ్లు తెచ్చినా చైర్మన్ల ద్వారా నోళ్లు మూయించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పీఏసీఎస్‌లో పది మందికి పైగా వ్యక్తిగత, బంగారు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు పొందారు. 350 మందికి పైగా రూ.కోట్లాది రుణాలు పొందినట్లు తెలిసింది. ప్రతి పీఏసీఎస్‌లో నలుగురైదుగురు డైరెక్టర్లు డిఫాల్టర్లుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిని గుర్తించిన ఉన్నతాధికారులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. అయినా సకాలంలో అప్పు మొత్తం చెల్లించని పక్షంలో పదవుల నుంచి దించేసి, తాకట్టు పెట్టిన ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
పీఏసీఎస్‌ల్లో వ్యక్తిగత రుణాలు పొందిన డైరెక్టర్లు
అప్పు బకాయిలపై సర్కార్ సీరియస్
రుణగ్రహీతలపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు
త్వరలో నోటీసుల జారీకి రంగం సిద్ధం
అవసరమైతే పదవి నుంచి తొలగించి, ఆస్తుల జప్తునకు సన్నద్ధం
వసూలు చేయని కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు
సంఘం ఆర్థిక బలోపేతానికి పాటుపడాల్సిన పలువురు పీఏసీఎస్ డైరెక్టర్లు పదవీ పలుకుబడితో రూ.లక్షల్లో రుణాలు పొందారు. గడువులోగా చెల్లించకపోగా డిఫాల్టర్లుగా మారారు. ఏళ్లుగా బకాయిలు చెల్లించడమే మానేశారు. దీనిపై సర్కార్ సీరియస్ కావడంతో శాఖాపరమైన చర్యలకు డీసీసీబీ ఉన్నతాధికారులు సన్నద్ధం అవుతున్నారు.
పీఏసీఎస్‌ల్లోని డైరెక్టర్లు తీసుకున్న అప్పులు సకాలంలో చెల్లించి, మిగతా రైతులకు ఆదర్శంగా ఉండాలి. అప్పు బకాయిలపై సర్కార్ సీరియస్‌గా ఉంది. ఇప్పటికై నా తీసుకున్న మొత్తం త్వరగా చెల్లించాలి. లేదంటే పదవీ గండంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
– కొత్తకుర్మ సత్తయ్య, డీసీసీబీ చైర్మన్

పదవులకు అప్పు ముప్పు!