
జోరు వాన
ఉప్పొంగిన ఈసీ, మూసీ వాగులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వర్షం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం దంచికొట్టింది. ఉదయం ప్రశాంతంగా, ఆహ్లాదంగా కన్పించిన వాతావరణం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హయత్‌నగర్ వద్ద ఉన్న హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పైకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డుపై నాలుగు అడుగుల ఎత్తు మేర వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, బీఎన్‌రెడ్డి, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, బాలాపూర్, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, మొయినాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ల తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. యాచారంలో అత్యధికంగా 17.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హయత్‌నగర్‌లో 11.2 సెంటీమీర్ల వర్షపాతం కురిసింది.
మళ్లీ తెరుచుకున్న గేట్లు
జంట జలాశయాల ఎగువ ప్రాంతంలోని ఈసీ, మూసీ వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో హిమాయత్‌సాగర్ రెండు గేట్లను నాలుగు ఫీట్ల ఎత్తు, ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లను రెండు ఫీట్ల చొప్పున పైకి ఎత్తి..వచ్చిన వరదను వచ్చినట్లే కిందికి వదులుతున్నారు. యాచారం మండలం గున్‌గల్, మల్కీజ్‌గూడ, నల్లవెల్లి, మాల్, తక్కళ్లపల్లి, మొండిగౌరెల్లి తదితర ప్రాంతాల్లో గంటకుపైగా కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈ వర్షంతో మెట్ట పంటలకు జీవం పోసినట్లయింది. 15 రోజుల విరామం తర్వాత వర్షం కురియడంతో ఆయా ప్రాంతాల్లోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంటజలాశయాలతో పాటు జిల్లాలోని పలు చెరువులు, కుంటలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శిఖం భూములు నీటమునిగి, పంటలు దెబ్బతింటున్నాయి. మరోవైపు ఏకధాటి వర్షాలు, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే అనేక మంది దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్నారు.
యాచారంలో అత్యధికంగా 17.95 సెంటీమీర్ల వర్షపాతం నమోదు
మళ్లీ తెరుచుకున్న జంటజలాశయాల గేట్లు
హైదరాబాద్–విజయవాడ రహదారిపైకి భారీగా వరద నీరు
వాహనదారుల ఇబ్బందులు