
చర్యలుంటాయా..?
యాచారం: తాడిపర్తి భూదాన్ భూముల వ్యవహారంపై రకరకాల చర్చ జరుగుతోంది. ఈ భూములకు అక్రమంగా ఫార్మా పరిహారం ఇవ్వడం.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లడం.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి విచారణ జరపడం.. పూర్తి స్థాయి నివేదికను సర్కార్‌కు అప్పగించడం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
పరిహారం రికవరీ చేస్తారా..?
తాడిపర్తిలో బొక్క సీతారెడ్డి కుటుంబ సభ్యులు 1954లోనే సర్వేనంబర్ 104లోని 250 ఎకరాలను సర్వోదయ భూదాన్ యజ్ఞ బోర్డుకు దానం చేశారు. దానం చేసిన భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని రైతులు అప్పట్లోనే అధికారులకు విన్నవించారు. అధికారుల నిర్లక్ష్యంతో తర్వాత కొందరు రైతులు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించి తమ పేరిట పట్టాదారు, పాసుపుస్తకాలు పొందారు. 2018లో ఫార్మాసిటీకి ఆ భూమిని తీసుకుంటున్నట్లు నోటిఫికేషన్ ప్రకటించారు. తర్వాత పట్టాదారు, పాసుసుస్తకాలు పొందిన 86 మంది రైతులు 190 ఎకరాలకుపైగా ఫార్మాసిటీకి ఇచ్చి దాదాపు రూ.27 కోట్లకు పైగా పరిహారం పొందారు. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో మీరాఖాన్‌పేట టీజీఐఐసీ వెంచర్‌లో ఎకరాకు 121 గజాల చొప్పున ఇచ్చే ప్లాట్ల సర్టిఫికెట్లను నిలిపేశారు. ప్రస్తుతం అక్రమాల వ్యవహారం సీఎం దృష్టికి వెళ్లడంతో పరిహారం రికవరీ చేస్తారా.. లేదా అనే సందేహం నెలకొంది.
అధికారులపై చర్యలుండేనా..?
భూదాన్ భూములకు సంబంధించి రైతులకు పరిహారం ఇవ్వొద్దని హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ హెచ్చరించినా అధికారులు లెక్కచేయలేదు. 2020–2023 మధ్యనే పరిహారం ఫైళ్లు చకచకా కదిలాయి. ఓ ఆర్డీఓ చక్రం తిప్పి రూ.కోట్లాది పరిహారాన్ని అప్పనంగా అందజేశారు. ఈ వ్యవహారంలో సదరు ఆర్డీఓతో పాటు యాచారం తహసీల్దార్ కార్యాలయంలోని రెవెన్యూ, సర్వే అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా అధికారుల విచారణలో భూదాన్ భూములకు పరిహారం ఇచ్చిన అప్పటి ఆర్డీఓ, ఇతర రెవెన్యూ, సర్వే శాఖ అధికారుల పేర్లతో నివేదికను సర్కార్‌కు అందజేసినట్లు సమాచారం.
సర్కార్‌కు నివేదిక అందజేశాం
భూదాన్ భూములకు సంబంధించి ఫార్మా పరిహారం అందజేసిన విషయమై పూర్తి స్థాయి విచారణ నివేదికను సర్కార్‌కు అందజేశాం. పరిహారం రికవరీ చేస్తారా.. అప్పటి అధికారులపై చర్యలు ఉంటాయా అనేది సర్కార్ పరిధిలో ఉంది.
– అనంత్‌రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం
భూదాన్ భూములకు ఫార్మా పరిహారం
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొనసాగిన విచారణ
నివేదిక సర్కార్‌కు అందజేసిన అధికారులు
ఏం చేస్తారనేదానిపై సర్వత్రా చర్చ