
వర్షాలు కురిసి.. జలాలు పెరిగి
● నిండుకుండల్లా చెరువులు, కుంటలు
● పరిసరాల్లో వృద్ధి చెందిన భూగర్భ జలాలు
● సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
మొయినాబాద్‌రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు, కుంటలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాల నిల్వలు పెరిగాయని నిపుణులు, అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పంటల సాగుకు అవసరమైన నీటి వనరులు సమకూరాయని భావిస్తున్నారు. బోరు బావులు సైతం సమృద్ధిగా నీటిని పోస్తున్నాయి. ఎక్కడ బోరు వేసినా ౖపైపెనే నీరు వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు.
రికార్డుస్థాయిలో వర్షాలు
సగటు వర్షపాతం 400 మిల్లీమీటర్లు కాగా ఆగస్టు చివరి నాటికి 612 మి.మీ నమోదయింది. చేవెళ్ల నియోజకవర్గంలో వర్షపాతం నమోదు ఇలా ఉన్నది. చేవెళ్ల మండలంలో 63 శాతం, మొయినాబాద్‌లో 53 శాతం, షాబాద్‌లో 83, శంకర్‌పల్లిలో 48 శాతం అధిక వర్షం కురిసినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవలేదు. జూలై రెండోవారం వరకు అడపాదడపా మోస్తరు వర్షాలు మాత్రమే కురిశాయి. ఆగస్టు నెలలో సమృద్ధిగా వానలు పడడంతో అధిక వర్షపాతం నమోదైంది. రానున్న రబీ సీజన్‌కు నీటి కొరత ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
ౖపైపెకి గంగమ్మ
వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం భూగర్భ జలాలు పైకి వచ్చేశాయి. గతంలో పాతాళానికి పడిపోయిన నీరు ప్రస్తుతం ౖపైపెకి పాకుతుంది. ఆగస్టు నెలలోనే 4.31 మీటర్ల మేర అండర్ గ్రౌండ్ వాటర్ వృద్ధి చెందాయి. వేసవితో పోలిస్తే చేవెళ్ల నియోజకవర్గంలోని ఆయా మండలాలలో మొయినాబాద్‌లో 5.06, చేవెళ్లలో 7.98, షాబాద్‌లో 6, శంకర్‌పల్లిలో 4.08 మీటర్ల నీటి మట్టం పెరిగాయి.
సమృద్ధిగా జలాలు
ఆగస్టు నెలలో అధిక వర్షాలు కురియడంతో సమీప వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కుంటలు నీటితో నిండి కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు సమృద్ధిగా పోస్తున్నాయి. ఈ సంవత్సరం పంటలకు నీటి కొరత ఉండదు.
– సైపాల్‌రెడ్డి, రైతు, అమ్డాపూర్
పెరిగిన సాగు విస్తీర్ణం
సమృద్ధిగా వర్షాలు కురవడంతో వరితో పాటు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. బోరు బావుల్లో జలాలు పెరిగాయి. వాగులు, వంకలు అలుగు పారుతున్నాయి. పత్తి, కంది ఇతర కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.
– అనురాధ, ఏఓ, మొయినాబాద్