
గోల్కొండ రోప్‌వే పై సాంకేతిక అధ్యయనం
సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ టూంబ్స్ నుంచి కోట వరకు ప్రతిపాదించిన రోప్‌వేపై గురువారం హెచ్‌ఎండీఏలో ప్రీబిడ్డింగ్ సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లపై హెచ్‌ఎండీఏ దృష్టి సారించింది. సుమారు 1.5 కి.మీ మార్గంలో నిర్మించనున్న రోప్‌వే కోసం ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పీ) టెండర్‌లను ఆహ్వానించారు. ఆసక్తిగల కన్సల్టెన్సీ సంస్థలు ఈ నెల 6 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే గురువారం ప్రీబిడ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్‌ఎఫ్‌పీ బిడ్డింగ్ కోసం కోసం దరఖాస్తు చేసుకున్న పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిడ్డింగ్ గడువును పెంచాలని పలువురు ప్రతినిధులు హెచ్‌ఎండీఏ అధికారులను కోరారు. సాంకేతికంగా ఈ ప్రాజెక్టుపై మరింత అవగాహన అవసరమని, అందుకోసం బిడ్డింగ్ గడువును పెంచాలని అధికారుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం.
ప్రతిష్టాత్మక ప్రాజెక్టు..
నిత్యం వేలాది మంది జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించే చారిత్రక గోల్కొండ కోటను, టూంబ్స్‌ను కలిపేలా నిర్మించనున్న రోప్‌వే ప్రాజెక్టును హెచ్‌ఎండీఏ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రూ.100 కోట్ల అంచనాలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోప్‌వేలు, స్కైవేలపై విస్తృత అధ్యయనం చేస్తున్న హెచ్‌ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా గోల్కొండ కోట నుంచి 1.5 కి.మీ దూరంలోని కుతుబ్‌షాహీల సమాధుల వరకు రోప్‌వే కోసం ఇప్పటికే ప్రణాళికలను రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం సైతం పచ్చజెండా ఊపింది. దీంతో ఆర్‌ఎఫ్‌పీ బిడ్డింగ్‌కు అధికారులు చర్యలు చేపట్టారు. రోప్‌వేకు అనుకూలమైన మార్గాన్ని నిర్ధారించడంతో పాటు, రక్షణశాఖ నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు అవసరమనే అంశంపైనా ఎంపికై న కన్సల్టెన్సీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వివిధ దేశాల్లో రోప్‌వేలు, కేబుల్ కార్ల నిర్వహణపైనా అధ్యయనం చేసి హెచ్‌ఎండీఏకు నివేదికను అందజేయాల్సి ఉంటుంది.
కేబుల్ కారులో సందర్శన..
గోల్కొండ కోట నుంచి పర్యాటకులు రోడ్డు మార్గంలో టూంబ్స్ వరకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఇరుకై న రోడ్డు, వాహనాల రద్దీ దృష్ట్యా చాలామంది గోల్కొండ కోట నుంచి టూంబ్స్ వరకు వెళ్లకుండానే వెనుదిరుగుతున్నట్లు అంచనా. ఈ క్రమంలో పర్యాటకుల రాకపోకలను సులభతరం చేయడంతో పాటు రోప్‌వే ద్వారా కేబుల్ కార్లలో ప్రయాణం చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 10 వేల మందికిపైగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. వీరిలో 3000 మంది వరకు విదేశీ టూరిస్టులు ఉంటారని అంచనా. రోప్‌వేను ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా పర్యాటకులకు మెరుగైన సదుపాయం కల్పించినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఆర్‌ఎఫ్‌పీ కోసం ఈ నెల 6 వరకు బిడ్డింగ్
ప్రీ బిడ్డింగ్ సమావేశంలో పాల్గొన్న పలు సంస్థలు
రూ.100 కోట్లతో హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు