
జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట ఓ నమూనా
హైడ్రా కృషిని అభినందించిన కేంద్ర బృందం
సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్‌యూఏ) అధికారుల బృందం గురువారం అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించింది. ఒకప్పుడు చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిన ఈ ప్రాంతం చెరువులా రూపాంతరం చెందిన పాత చిత్రాలను చూసి అధికారులు ఆశ్చర్యచకితులయ్యారు. చెరువుల పరిరక్షణకు జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట ఒక నమూనా అవుతుందని బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అడిషనల్ చీఫ్ టౌన్ ప్లానర్ మోనీస్ ఖాన్ పేర్కొన్నారు. కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించి, మండు వేసవిలో రెండు మీటర్ల లోతు నీరు ఉబికి వచ్చే వీడియోలను చూసిన ఆయన ఆశ్చర్యపోయారు. హైడ్రా కృషిని అభినందించారు. చెరువు చుట్టూ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. చెరువుకు ఆనుకుని సాగే మురుగు కాల్వలోంచి వరద నీరు మాత్రమే వచ్చేలా ఇన్‌లెట్‌ను నిర్మించడంపై హర్షం వెలిబుచ్చారు. ఇటీవల కురిసిన వర్షాల సమయంలో వరద నీరు ఎలా వచ్చి చేరిందో వీడియాల ద్వారా హైడ్రా అధికారులు కేంద్ర బృందానికి చూపించారు. చెరువు ఔట్‌లెట్‌ను సైతం పరిశీలించారు. కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ అసోసియేట్ టౌన్ ప్లానర్ సందీప్ రావుతో పాటు.. హైడ్రా అధికారులు మోహనరావు, బాలగోపాల్, విమోస్ టెక్నో క్రాట్ ఎండీ పి.యూనస్, జీహెచ్‌ఎంసీ అడిషనల్ చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, సిటీ ప్లానర్ ఉమాదేవి తదితరులు కేంద్ర బృందంతో ఉన్నారు.