
డీ అడిక్షన్ సెంటర్ సిబ్బందికి శిక్షణ
చంచల్‌గూడ: మత్తు మందులు లేని సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖకు నషాముక్త భారత్ అభియాన్‌లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ శాఖ నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. జైళ్ల శాఖ నిర్వహిస్తున్న డీ అడిక్షన్ సెంటర్లలో విధులు నిర్వహించేందుకు గత నెలలో కాంట్రాక్ట్ పద్దతిన 28 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న వారికి గురువారం చంచల్‌గూడలోని సీకా సంస్థలో శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ డీ అడిక్షన్ కేంద్రాల ద్వారా మత్తు పదార్థాలకు బానిసలైన ఖైదీలకు వైద్య చికిత్స, కౌన్సెలింగ్, పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. డీ అడిక్షన్ కేంద్రాల్లో ఉండే వారితో ఎలా మెలగాలో, వారిలో పరివర్తన ఏ విధంగా తీసుకురావాలి అనే అంశంపై సిబ్బంది అంటీ డ్రగ్స్, నార్కోటిక్, మానసిక వైద్య కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటారన్నారు. కార్యక్రమంలో ఐజీ మురళీబాబు, సీకా ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.