
ఫార్మాప్లాట్లు
2,200 ఎకరాలు సర్కార్ స్వాధీనంలోనే!
● అథారిటీలో పరిహారం తీసుకోండి.. లేదంటే కొట్లాడి మరింత పెంచుకోండి ● ప్లాట్ల లాటరీల లిస్టులో 700 మంది రైతులు పేర్లు ● ఆందోళన చెందుతున్న కర్షకులు
యాచారం: గత ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు సేకరించిన భూములకు కాంగ్రెస్ సర్కార్ ఈ నెల 7 నుంచి లాటరీ విధానంలో ప్లాట్ల పట్టాలిస్తోంది. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన 700 మందికి పైగా రైతులు తమ పట్టాభూమి ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో అధికారులు 2,200 ఎకరాల పట్టా భూమికి అవార్డులు పాస్ చేసి పరిహారాన్ని అథారిటీలో జమచేశారు. భూ రికార్డులను టీజీఐఐసీ పేరిట మార్చేశారు. రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో రైతుల పేరిట భూ రికార్డులు మార్చి రైతు భరోసా, బ్యాంకు రుణాలు, రుణమాఫీ వర్తింప చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రైతులు తమకు న్యాయం చేయాలంటూ సీసీఎల్‌ఏ, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రస్తుతం ప్లాట్లు కేటాయిస్తున్నామని రైతులు లాటరీలో పాల్గొనాలని అధికారులు ఆయా గ్రామ పంచాయతీల్లో లిస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఇది చూసిన రైతులు తమ ప్రమేయం లేకుండానే భూ రికార్డులు మార్చి తమ పట్టాభూములు గుంజుకుంటున్నారని ఆందోళన చెందుతున్నారు.
పరిహారం పెంపునకు ఓకే
నిబంధనల ప్రకారం నాలుగు గ్రామాల్లోని 2,200 ఎకరాల పట్టాభూములు టీజీఐఐసీ ఆధీనంలోనే ఉన్నాయి. రైతులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా రికార్డులు మార్చడం కుదరదు. పరిహారం పెంచే అవకాశం మాత్రమే ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. రైతులు అనుకూలంగా ఉంటే వారితో సంప్రదింపులు జరిపి ఎకరాకు రూ.35 లక్షల నుంచి రూ.50లక్షల లోపు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇందుకు రైతులు నిరాకరించడంతో పాటు అధికారులు సైతం తమ వైఖరి మార్చుకోవడం లేదు.
లిస్ట్‌లో 150 మంది పేర్లు
అథారిటీలో పరిహారాన్ని జమ చేసిన రైతులకు ఎకరాకు 121 గజాల చొప్పున ఫార్మా ప్లాట్లు కేటాయించారు. 700 మందికి పైగా రైతులకు భూరికార్డుల్లో ఉన్న ఎకరాలను బట్టి ఫార్మా ప్లాట్లను కేటాయించి లాటరీ లిస్టుల్లో పేర్లను ప్రకటిస్తున్నారు. రైతులు మాత్రం మేము భూములే ఇవ్వలేదు.. ప్లాట్లు మాకెందుకని తిరస్కరిస్తున్నారు. అధికారులు ఈ నెల 7వ తేదీ నుంచి రైతుల పేర్లను ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శించి లాటరీలో పాల్గొనాలని మీకు కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్లాట్లను తీసుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులొస్తాయని అధికారులు చెబుతున్నారు. ఫార్మాకు మేము పట్టా భూములు ఇవ్వలేదు, మాకు ప్లాట్లు వద్దని, లాటరీ లిస్టుల్లో తమ పేర్లు తొలగించాలంటూ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. కుర్మిద్ద అనుబంధ గిరిజన తండాలైన మర్లకుంట, మంగలిగడ్డ, పోతుబండ తండాలకు చెందిన 150 మంది రైతులకు చెందిన 200 ఎకరాల పట్టా భూమికి మొత్తం లాటరీ లిస్టుల్లో పేర్లొచ్చాయి.

ఫార్మాప్లాట్లు