
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య
షాబాద్: నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ వరమని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని నాగర్‌కుంట గ్రామానికి చెందిన పాలమాకుల ఆనందంకు రూ.1 లక్ష 48 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మక్దూం భనన్‌లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో చెక్కు మంజూరు అయిందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు నర్వతాలు, మండల కార్యదర్శి శ్రీశైలం తదితరులు ఉన్నారు.
నిర్మాణ దారుడిపైకేసు నమోదు
ఇబ్రహీంపట్నం రూరల్: బాలకతో వెట్టిచాకిరి చేయిస్తున్న ఓ రియల్ ఎస్టేట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆదిబట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి ఎంపీపటేల్‌గూడ సమీపంలో అనిల్ కన్‌స్ట్రక్షన్ యజమాని, భవన నిర్మాణ రంగంలో జార్ఖండ్‌కు చెందిన 16 ఏళ్ల బాలికతో పనిచేయిస్తుండగా.. బాలికకు విముక్తి కల్పించారు. అనంతరం యజమానిపై కేసు నమోదు చేశారు.
హ్యుందాయ్ డిజిటల్ ఫ్లోట్ వ్యాన్‌లు ప్రారంభం
సాక్షి, సిటీబ్యూరో: భారతదేశంలో మొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్, అతిపెద్ద ఎగుమతిదారు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఇటీవల గ్రామీణ అవుట్‌లెట్‌లలో డిజిటల్ ఫ్లోట్ కార్యకలాపాలను ప్రారంభించింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో లోతైన, గణనీయమైన వ్యాప్తి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని డిజిటల్ ఫ్లోట్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ ఎస్‌యూబీ ఎక్స్టర్, వెన్యూ, గ్రాండ్ ఐ10 నియోస్ వినియోగదారుల ఇంటి వద్దకు నేరుగా రవాణా చేస్తారు. కార్యక్రమాన్ని హ్యుందాయ్ మోటా ర్ ఇండియా లిమిటెడ్ ఆర్‌ఎస్‌హెచ్ రామ్‌కుమార్ జి, ఆర్‌పిఎస్‌హెచ్ మనోజ్ బాథం, హైదరాబాద్ నుంచి డిజిటల్ ఫ్లోట్ వ్యాన్‌లను జెండా ఊపి ప్రారంభించారు. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రయాణించనున్నాయని వారు తెలిపారు.
హైటెన్షన్ టవర్ ఎక్కి యువకుడి హల్‌చల్
గచ్చిబౌలి: మతిస్థిమితం లేని ఓ యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ చేసిన సంఘటన శుక్రవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగ్నంగా తిరుగుతున్న ఓ యువకుడు శుక్రవారం ఉదయం రాఘవేంద్ర కాలనీలో రోడ్డులో హైటెన్షన్ టవర్ ఎక్కాడు. దీనిని గుర్తించిన వాహనదారులు, స్థానికులు అతడిని కిందికు దిగాలని కేకలు వేసినా వినకుండా టవర్ చివరి వరకు ఎక్కాడు. దీంతో వారు డయల్ 100కు సమాచారం అందించడంతో గచ్చిబౌలి పెట్రోల్ మొబైల్ సిబ్బంది అక్కడికి చేరుకుని కిందకు దిగాలని అతడికి నచ్చజెప్పారు. దాదాపు గంట సేపటి తర్వాత అతను కిందకు దిగిరావడంతో దుస్తులు వేయించి పీఎస్‌కు తీసుకెళ్లారు. అతడిని రాజరాజేశ్వరీనగర్‌లో నివాసం ఉంటున్న ఆకాష్ ఆర్కంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.