
పోగొట్టుకున్న నగదు బ్యాగు అప్పగింత
కందుకూరు: పోగొట్టుకున్న నగదు సంచిని పోలీసులు బాధితులకు అప్పగించారు. సీఐ సీతారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు మున్సిపాలిటీ విఠాయిపల్లికి చెందిన ఎంకే విష్ణువర్ధన్ వద్ద పని చేసే సురేష్.. గురువారం సాయంత్రం మండల పరిధి జైత్వారం సమీపంలోని రాంరెడ్డి ఫౌల్ట్రీ ఫాంనకు వచ్చాడు. అక్కడ నుంచి రూ.4,01,400(నాలుగు లక్షల పద్నాలుగు వందల రూపాయలు)లను బ్యాగులో పెట్టుకుని బైక్‌పై తిరిగి విఠాయిపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యలో కొత్తగూడ శ్రీ నిఖేతన్ స్కూల్ వద్ద డబ్బుల బ్యాగు పడిపోయింది. కొద్దిసేపటికి కిందపడ్డ ఆ బ్యాగ్‌ను గుర్తించిన ఆ స్కూల్ అడ్మిన్ రోజ.. ఆ నగదు సంచిని భద్రపరిచారు. పోగొట్టుకున్న వారు ఎవరైనా వస్తే ఇద్దామని వేచి ఉన్నారు. బ్యాగ్ పడిపోయిన విషయాన్ని బాధితుడు సురేష్.. తన యజమానికి చెప్పాడు. ఆయన అక్కడి కౌన్సిలర్ సుజాత సహాయంతో కందుకూరు పీఎస్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ సీతారామ్, ఎస్‌ఐ సైదులు ఆ మార్గంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయాలని కానిస్టేబుల్ కృష్ణ, హోంగార్డు రమేష్‌ను ఆదేశించారు. దీంతో వారు జైత్వారం నుంచి కెమెరాలను పరిశీలన చేసుకుంటూ.. కొత్తగూడ వైపునకు వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కొత్తగూడ పరిధి శ్రీ నిఖేతన్ హైస్కూల్ వద్ద కెమెరాల తనిఖీకి వచ్చిన పోలీసులకు.. ఆ పాఠశాల ఇన్‌చార్జి మధుసూదన్‌రెడ్డి నగదు బ్యాగు భద్రపరిచిన విషయం చెప్పారు. అనంతరం పోలీసుల సమక్షంలో.. పాఠశాల నిర్వాహకులు నగదు బ్యాగ్‌ను బాధితులకు అప్పగించారు.