
జనాభా.. గబగబా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉద్యోగ, ఉపాధి నిమిత్తం జిల్లాకు వచ్చి స్థిరపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జనాభాతో పాటే నిర్మాణాలు కూడా భారీగా పెరిగాయి. పల్లెలు, పట్టణాలకు తేడా లేకుండా పోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 24,46,265 మంది ఉండగా.. వీరిలో 12,54,184 మంది పురుషులు, 11,92,081 మంది మహిళలు ఉన్నారు. ఐటీ అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్, భారీ పరిశ్రమలతో 13 ఏళ్ల వ్యవధిలోనే జిల్లా జనాభా డబుల్ (48 లక్షలు) అయ్యింది.
భారీగా పెరిగిన వలసలు
2023 నవంబర్‌లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 35,23,219 చేరుకుంది. వీరిలో 18,23,165 మంది పురుషులు ఉండగా, 16,99,600 మంది మహిళలు, 454 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. వీరు కాకుండా 18 ఏళ్లలోపు వారు మరో 12.50 లక్షల మంది ఉన్నట్లు అంచనా. అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గాల జాబితాలో శేరిలింగంపల్లి మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు ఉన్నా యి. మొత్తం జనాభాలో 18 ఏళ్లలోపు వారు 12.50 లక్షల మంది ఉండగా, ఆ తర్వాతి వయ స్కులు 35 లక్షల మందికిపైగా ఉండటం గమనార్హం. పెరిగిన నిత్యావసరాల ధరలు, వైద్య ఆరోగ్య ఖర్చులు, పిల్లల చదువులకు భారీగా ఖర్చవుతుండటంతో మెజార్టీ యువత ఒకరు లేదా ఇద్దరితోనే సరిపెట్టుకుంటున్నప్పటికీ.. వలసల కారణంగా జనాభా అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. 2011లో 5,63,565 నివా సాలు ఉండగా, 2025 నాటికి గృహ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య ఆధారంగా 13,22,646 చేరింది. మరోవైపు ఉమ్మడి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక్కో ఇంట్లో ఆరు నుంచి ఎనిమిది మంది ఉండగా, ప్రస్తుతం సగటున ముగ్గురు నుంచి నలుగురు మాత్రమే ఉంటున్నారు.
వయసుల వారీగా పరిశీలిస్తే..
● ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న వారు 92,540 మంది ఉండగా, 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న వారు 6,37,940 మంది ఉన్నారు. 30 నుంచి 39 ఏళ్ల వయసు ఉన్న వారు 10,73,733 మంది, 40 నుంచి 49 ఏళ్ల వయసు ఉన్న వారు 7,77,548 మంది ఉన్నారు. 50 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారు 4,77,325 మంది ఉండగా, 60 నుంచి 69 ఏళ్ల వారు 2,81,235 మంది ఉన్నారు. 70 నుంచి 79 ఏళ్ల వయసు వారు 1,38,324 మంది, 80 ఏళ్లు పైబడిన వారు 43,775 మంది ఉండ డం గమనార్హం.
● వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏటా సగటున 42 వేల ప్రసవాలు జరుగుతున్నట్లు అంచనా. వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెరగడం, ఆరోగ్య సూత్రాలు పాటిస్తుండటం, అనేక ఆస్పత్రులు అందుబాటులోకి రావడంతో సగటు మనిషి ఆయుఃప్రమాణం భారీగా పెరిగింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు 4.63 లక్షల మందికిపైగా ఉండడం విశేషం.
● వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం డేటా ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలు సుమారు రెండున్నర లక్షల మంది ఉన్నట్లు అంచనా.
● విద్యాశాఖ లెక్కల ప్రకారం ఆరు నుంచి 14 ఏళ్లలోపు వారు 7.50 లక్షల మంది ఉన్నట్లు అంచనా. 15 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న వారు (ఇంటర్మీడియెట్/డిగ్రీ కోర్సులు చదువుతున్నవారు) రెండున్నర నుంచి మూడు లక్షల మంది ఉన్నట్లు అంచనా.
జిల్లాలో శరవేగంగా పెరుగుతున్న ప్రజలు
ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం భారీగా రాక
ఆ తర్వాత ఇక్కడే స్థిర నివాసం
2011తో పోలిస్తే 2025లో రెండింతలు
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం