
విద్యావ్యవస్థలో మార్పులు అవసరం
ఇబ్రహీంపట్నం: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. ఇందులో పేద, ధనిక అనే తేడా లేకుండా పిల్లలందరూ ఒకే చోట చదివిన రోజే నవ శకానికి అడుగులు పడుతాయని ఆకాంక్షించారు. సామాజిక బాధ్యతలో భాగంగా కెఫిన్ టెక్నాలజీ కార్పొరేట్ సంస్థ రూ.1.10 కోట్లు వెచ్చించి సంకల్ప్ పేరుతో ఇబ్రహీంపట్నంలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని ఆధునీకరించింది. నూతన వసతుల ప్రారంభోత్సవానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి హాజరైన ఆమె మాట్లాడుతూ.. కులమతాలు, పేద, ధనిక తారతమ్యం లేని విద్యాలయాల రూపకల్పన కోసం ప్రధాని, ముఖ్యమంత్రికి ప్రతీ ఇంటినుంచి ఒక లేఖ రాయాలని పిలుపునిచ్చారు. అమ్మాయిల చదువుతోనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థినులకు సూచించారు. స్వల్పకాలిక ఆనందాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని, అవసరం మేరకే సోషల్ మీడియాను వినియో గించాలని తెలిపారు. ప్రైవేటు హాస్టళ్లతో పోలిస్తే ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, బాగా చదవాలని కోరారు. పాశ్చాత్య ధోరణులను, విష సంస్కృతిని విడనాడాలన్నారు. ఆడ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోలీసులను ఆశ్రయించాలని, వారి వివరాలు బయటపెట్టకుండా తానే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మహిళా కమిషన్‌కు వస్తున్న అధిక ఫిర్యా దులు లివింగ్ రిలేషన్‌షిప్‌లకు సంబంధించినవేనని తెలిపారు. వసతుల కల్పనకు కృషిచేసిన కేఫిన్ సంస్థను అభినందించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజ, కెఫిన్ టెక్ సంస్థ హెచ్‌ఆర్ సుజన్, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ కరుణాకర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భూపతిగాల్ల మహిపాల్, డీటీడీఓ రమాదేవి, డీఈఓ సుశీందర్‌రావు, డీఆర్‌డీఏ పీడీ శ్రీలత, సీఐ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద