
పరిశీలిస్తాం.. పరిష్కరిస్తాం
శంకర్‌పల్లి: మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎ.యోగేశ్ తెలిపారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘ఫోన్ ఇన్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పట్టణవాసులు పారిశుద్ధ్యం, అంతర్గత మురుగునీటి కాలువలు, రోడ్లు, వీధి కుక్కలు, ఆక్రమణలు వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని ఓపిగ్గా విని, నమోదు చేసుకుని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రశ్న: శంకర్‌పల్లిలో పంచాయతీగా ఉన్నప్పుడు నిర్మించిన దుకాణాలకు కాలం ముగిసినప్పటికీ రీ టెండర్లు వేయడం లేదు. మున్సిపాలిటీకి ఏటా కోట్లలో నష్టం వస్తోంది.
– దయాకర్‌రెడ్డి (బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు), మహేందర్‌రెడ్డి (శంకర్‌పల్లి)
కమిషనర్: దుకాణాల రీటెండర్ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నాం. కలెక్టర్ వేసిన కమిటీ రిపోర్టు ఆధారంగా ముందుకు వెళ్తాం. వీలైనంత త్వరగా రీటెండర్ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాం.
ప్రశ్న: సింగాపురంలో శ్మశానవాటిక లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. పలు కాలనీల్లో తాగునీటి సమస్య ఉంది.
– వెంకట్‌రాంరెడ్డి, శశిధర్‌రెడ్డి (సింగాపురం)
జవాబు: శ్మశానవాటిక కోసం స్థల అన్వేషణ చేస్తున్నాం. ఇప్పటికే రెవెన్యూ అధికారులతో చర్చిస్తున్నాం. త్వరలో స్థల సేకరణ చేసి, నిర్మిస్తాం. పాడైన బోర్లను వెంటనే గుర్తించి మరమ్మతులు చేయిస్తాం.
ప్రశ్న: ఖాళీ ప్రదేశాల్లో పిచ్చిమొక్కలు, చెత్తా, చెదారం పెరిగిపోయాయి. పాములు, దోమల బెడద ఎక్కువైంది. కొన్నిచోట్ల రోడ్లు పాడై వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది.
– మహమ్మద్ యూనస్ (బ్లూ ఉడ్ వెంచర్, శంకర్‌పల్లి)
జవాబు: పారిశుద్ధ్య కార్మికులు, డోజర్లతో చెత్తను వెంటనే శుభ్రం చేయిస్తాం. రోడ్లు పాడైన చోట తాత్కాలికంగా మొరం వేసి బాగు చేస్తాం.
ప్రశ్న: ఫత్తేపూర్ రైల్వే బ్రిడ్జి నుంచి శంకర్‌పల్లి చౌరస్తా వరకు రహదారి నిర్మాణం అసంపూర్తిగా ఉంది. పెద్ద ఎత్తున గుంతలు ఉండడంతో రాత్రి వేళ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
– శ్రీకాంత్‌రెడ్డి, మహేశ్ (రావులపల్లి)
జవాబు: ఈ విషయమై ఇప్పటికే ఆర్‌అండ్‌బీ, పోలీసులతో కలిసి పరిశీలించాం. ఆర్‌అండ్‌బీ ఈఈతో మాట్లాడి వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తాం.
ప్రశ్న: ఆదర్శ్‌నగర్ కాలనీలో అంతర్గత మురుగునీటి కాలువలు, రోడ్లు, తాగునీరు, గుంతల్లో మొరం వేయడం వంటి సమస్యలు ఉన్నాయి.
– రాంచందర్, రాములు, మాణిక్, అంజనేయులు (ఆదర్శ్‌నగర్ కాలనీ)
జవాబు: అంతర్గత మురుగునీటి కాలువలు, రోడ్ల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. ఆమోదం రాగానే పనులు ప్రారంభిస్తాం. సిబ్బందిని పంపి రోడ్లపై గుంతల్ని పూడ్చి వేయిస్తాం.
ప్రశ్న: పిచ్చి మొక్కలు విపరీతంగా ఉండడంతో దోమల బెడద ఎక్కువైంది. పిల్లలు ఆడుకోడానికి సరైన పార్కులు లేవు. కొంత మంది ఇంట్లో సెప్టిక్ ట్యాంకు నిర్మించుకోకుండా.. డ్రైనేజీలోకి వదిలేస్తున్నారు.
– శ్రీనివాస్, రఘుపాల్‌రెడ్డి, రవీందర్, ఫణి రాజ్ (శ్రీరాంనగర్ కాలనీ)
జవాబు: కాలనీలో పార్కు కోసం రూ.17 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. అక్రమ నిర్మాణాలు, సెప్టిక్ ట్యాంకుల గురించి సిబ్బందిని పంపి విచారణ చేస్తాం. ఇష్టారీతిన చెత్త, చెదారం వేసే వాళ్లకు జరిమానా వేసేందుకు సిద్ధం అవుతున్నాం.
ప్రశ్న: మణిగార్డెన్ ఎదురుగా ఉన్న కాలనీలో 30 ఇళ్లకుపైగా ఉన్నప్పటికీ నీటి కనెక్షన్ లేదు. ఉన్న బోరును కూడా మరమ్మతులకు గురైన ప్రతీసారి మేమే సొంతంగా బాగు చేయించుకుంటున్నాం. అంతర్గత మురుగునీటి సమస్య సైతం ఉంది.
– మాణిక్యప్రభు, వెంకటేశ్వరరావు, వీరేశం, లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి (9వ వార్డు, మణిగార్డెన్ ఎదురుగా)
జవాబు: అమృత్ 2.0 కింద పట్టణంలో ఆరు తాగునీటి ట్యాంకులను నిర్మిస్తున్నాం. వాటి ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. పాడైనా బోర్లకు వెంటనే మరమ్మతులు చేయిస్తాం.
ప్రశ్న: గీతా మందిర్ ప్రాంతంలో ఆరు నెలలుగా వీధిదీపాలు వెలగడం లేదు. రాత్రి వేళ ఇంటి నుంచి బయటికి రావడానికి ఇబ్బంది అవుతోంది.
– దామోదర్, రమేశ్, సందీప్, విజయ్ (గీతా మందిర్)
జవాబు: సిబ్బందిని పంపి వెంటనే అవసరమున్న చోట వీధి దీపాలను ఏర్పాటు చేయిస్తాం.
ప్రశ్న: పోలీస్ క్వార్టర్స్‌కి సమీపంలో కొత్త సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో కొంత మంది ప్రభుత్వ స్థలాన్ని అక్రమిస్తున్నారు.
– గోవర్థన్, నర్సింగ్‌రావు (15వ వార్డు)
జవాబు: ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులను పంపి సమస్యను పరిష్కరిస్తాం.
ప్రశ్న: మున్సిపల్ పార్కులో పిచ్చి మొక్కలు పెరిగాయి, సెంట్రల్ లైటింగ్ సిస్టం పాడైంది.
– సంపత్, రవీందర్‌రెడ్డి (గాయత్రీ నగర్)
జవాబు: సిబ్బందిని పంపి, వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం.
వీలైనంత త్వరగా చర్యలు
శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేశ్
ఫోన్‌ఇన్ కార్యక్రమానికి స్పందన

పరిశీలిస్తాం.. పరిష్కరిస్తాం