
భూ సమస్యలు సత్వరం పరిష్కరించండి
యాచారం: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. యాచారం తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన భూ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎందుకు తిరస్కరించారో కూడా దరఖాస్తు దారులకు తెలియజేయాలని సూచించారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన లబ్ధిదారులకే లాటరీల్లో ప్లాట్లు, రిజిస్ట్రేషన్లు చేసేలా చూడాలన్నా రు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చూడాలని, గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా, నీటి ట్యాంకులు శుభ్రంగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వర్షాలు కురిసిన వెంటనే విరివిగా మొక్కలు నాటేలా సిద్ధం కావాలని సూచించారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, యాచారం తహసీల్దార్ అయ్యప్ప, మండల పంచాయతీ అధికారి శ్రీలత, ఈజీఎస్ ఏపీఓ లింగయ్య పాల్గొన్నారు.
బాల కార్మికులకు విముక్తి
శంకర్‌పల్లి: ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా శుక్రవారం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మోకిల, జన్వాడ గ్రామాల పరిఽధిలోని రెండు కన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో పని చేస్తున్న ఆరుగురు బాల కార్మికులను పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని ఠాణాకి తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. రెండు కంపెనీలపై కేసు నమోదు చేశారు.
ప్రజలకు మెరుగైన
వైద్య సేవలు అందించాలి
ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని శుక్రవారం జిల్లా వైద్యాధికారి డా.వెంకటేశ్వర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో స్టాఫ్ రిజిస్టర్, మందుల స్టాకును ఆయన పరిశీలించారు. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రస్తుత సీజన్‌లో గ్రామాల్లో ప్రబలే వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు ఇవ్వాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డా.మంజులాదేవి, డా.నాగరాజు, డా.మైమునాబేగం, డా.జయశ్రీ, సిబ్బంది తిరుపతిరెడ్డి, చంద్రశేఖర్, సునీత, వేణు, ఏసుమణి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
కందుకూరు: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు మండలంలోని కొత్తగూడ పంచాయతీ కార్యదర్శి ఉమాదేవిని.. పారిశుద్ధ్యం, ట్రాక్టర్ నిర్వహణ, తడి పొడి చెత్త సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి పంచాయతీ కార్యదర్శి డి.అనితను కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం డీపీఓ సురేష్‌మోహన్ సస్పెండ్ చేశారు.
నేడు నియామక పత్రాలు
సాక్షి, సిటీబ్యూరో: రోజ్‌గార్ మేళా కింద ఎంపికై న కేంద్ర ప్రభుత్వ నూతన ఉద్యోగులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం నియామక పత్రాలను అందజేయనున్నారు. సికింద్రాబాద్ బోయిగూడలోని రైల్ కళారంగ్‌లో నిర్వహించనున్న రోజ్‌గార్‌మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక లేఖలు అందజేస్తారు.