
అభివృద్ధి ఘనత మాదే
మాడ్గుల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాలను కైవసం చేసుకుంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే విజయానికి సోపానాలుగా నిలుస్తాయని అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయనతోపాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. కల్వకుర్తి ఎమెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి మండల కేంద్రంలో రూ.12.70 కోట్లతో నిర్మించే 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆమనగల్లు మండలం కోనాపూర్ నుంచి మాడ్గుల వరకు రూ.45 కోట్లతో చేపట్టే, మాడ్గుల నుంచి అందుగులకు రూ.30 కోట్లతో నిర్మించే బీటీ డబుల్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 220 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపీణి చేశారు. అనంతరం ఆమనగల్లు మార్కెట్ మాజీ చైర్మన్ బట్టు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని చెప్పారు. ట్రిపుల్ ఆర్, ఐటీ పరిశ్రమలు, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంతో రాబోయే రోజుల్లో మాడ్గులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం
స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఎప్పుడూ ప్రజల పక్షమేనని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా సాగుతున్న మాదిగల వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూసి బిల్లుకు అసెంబ్లీలో ఆమోదించడం జరిగిందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే సంకల్పమని, ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
బీఆర్‌ఎస్ పాలనలో అధోగతి
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తోందని చెప్పారు. బీసీ కులగణన చేపట్టడంతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ పద్మారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు
మాడ్గుల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు