
అధికారిక ముద్ర!
శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025
అక్రమాలకు..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: లింకు డాక్యుమెంట్ నంబర్ లేకపోయినా.. ఇరువురి మధ్య ఆర్థికపరమైన లింకు కలిస్తే చాలు.. ఎలాంటి స్థలానికై నా ఇట్టే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్, సబ్ రిజిస్ట్రా ర్లు అక్రమార్కులతో చేతులు కలుపుతూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. విలువైన స్థలాల ఆక్రమణలకు, ఘర్షణలకు కారణమవుతున్నారు. అక్రమ లే అవుట్‌కు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా గండిపేట ఎస్‌ఆర్‌ఓ అధికారిక ముద్ర వేస్తే.. ఎలాంటి నిర్మాణాలు లేని ఖాళీ ప్లాట్లకు ఎల్బీనగర్ మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారు. లింకు డాక్యుమెంట్ నంబర్ లేని ప్లాట్లకు ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇక ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ కానీ ఖాళీ స్థలాలకు తాండూరు ఎస్‌ఆర్‌ఓ తేదీలు ఏమార్చి రెండు వందలకుపైగా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదమైంది.
అదే గండిపేట రహస్యం
సికిందర్‌గూడలోని పది ఎకరాల భూమిపై కోర్టులో వివాదం కొనసాగుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక రికార్డుల్లో ఆ భూములపై డీఏజీపీఏ (డెవలప్‌మెంట్ అగ్రిమెంట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) ఉన్నప్పటికీ తప్పుడు సమాచారంతో దాన్ని రద్దు చేసి, రాత్రికిరాత్రే నాలా కన్వర్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఓ తెల్లకాగితంపై లే అవుట్, అందులోని ఖాళీ ప్లాట్లకు బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ ఇంటి నంబర్లు జారీ చేయడం, తర్వాత వారు టీఎస్ బీపాస్‌కు దరఖాస్తు చేయడం, ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇంటి నిర్మాణానికి జారీ చేసిన తాత్కాలిక అనుమతుల ఆధారంగా ఏకంగా 23 ప్లాట్లకు గండిపేట సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం. మున్సిపల్ కార్పొరేషన్, రిజిస్ట్రేషన్ అధికారులు కలిసి అక్రమ లే అవుట్‌కు అధికారిక ముద్ర వేశారు. అప్పటికే జీపీఏ చేసుకున్న నిర్మాణ సంస్థ ఫిర్యాదుతో విషయం బయటపడింది.
అవకాశంగా లొసుగులు
సరూర్‌నగర్ మండలం కర్మన్‌ఘాట్ రెవెన్యూ సర్వే నంబర్ 60లోని భూమిని 45 ఏళ్ల క్రితమే అప్పటి పంచాయతీ అనుమతితో లే అవుట్ చేశారు. యజమానులు ఆయా ప్లాట్లన్నీ అమ్మేశారు. అప్పట్లో డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసే వ్యవస్థ లేకపోవడం, ప్రస్తుతం ఆయా ప్లాట్ల వివరాలు ఆన్‌లైన్‌లో కన్పించక పోవడాన్ని ఓ ముఠా అవకాశంగా తీసుకుంది. తొలుత పాతస్టాంపు పేపర్లపై నోటరీ డాక్యుమెంట్ సృష్టించింది. తర్వాత ఆస్తికి వ్యాల్యూయేషన్ చేయించింది. ఎల్బీనగర్ మున్సిపల్ అధికారులకు డబ్బుల ఎర వేసి ఎలాంటి నిర్మాణాలు లేని ఖాళీ స్థలానికి ఇంటి నంబరు సహా ఆస్తిపన్ను చెల్లింపు రసీదులను సంపాదించింది. పూర్వ లింకుడాక్యుమెంట్ నంబర్, ఈసీ కూడా లేని ఖాళీ ప్లాట్‌కు ఎల్బీనగర్ సబ్‌రిజిస్ట్రార్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారో అంతు చిక్కడం లేదు. రూ.2 కోట్లకుపైగా విలువ చేసే ఖాళీ స్థలాన్ని ఇటీవలే ఓ ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇచ్చిన పత్రాల ఆధారంగానే తాను రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చిందని, తర్వాత స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుతో డాక్యుమెంట్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడం జరిగిందని ప్రస్తుత ఎస్‌ఆర్‌ఓ చెబుతుండటం విశేషం. ఈ ఒక్క లే అవుట్‌లోనే ఈ తరహా ప్లాట్లు మరో 20 వరకు ఉన్నట్లు సమాచారం.
స్కానింగ్ చేయకపోవడంతో..
అనధికారిక లే అవుట్‌లో ఎల్‌ఆర్‌ఎస్ లేని ఖాళీ ప్లాట్లకు తాండూరు సబ్ రిజిస్ట్రార్ అధికారులు అధికారిక ముద్ర వేశారు. నిబంధనల ప్రకారం 2020 ఆగస్టు 26 నాటికి వేసిన లే అవుట్‌లోని ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లే అవుట్‌లో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రర్ అయిఉన్నప్పుడే మిగతావి కూడా రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు కల్పించింది. ఈ ఉత్తర్వులను అవకాశంగా తీసుకుని కటాఫ్ తేదీ తర్వాత వేసిన లే అవుట్‌లోని ప్లాట్లను కటాఫ్ తేదీలోని ప్లాట్లుగా చూపించి 25 శాతం రాయి తీతో ఆరు రోజుల్లోనే రెండు వందలకుపైగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. డాక్యుమెంట్లు స్కానింగ్ చేయకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శేరిలింగంపల్లి మండలం నానక్‌రాంగూడ నాలా కన్వర్షన్ లేని 37,061 గజాల స్థలానికి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదమైంది.
న్యూస్‌రీల్
లేని ఉద్యోగి పేరున..
నార్సింగి మున్సిపల్ పరిధి సర్వే నంబర్ 300 నుంచి 303 వరకు, 306 నుంచి 311 వరకు, 313 నుంచి 315లోని భూమిలో గతంలోనే మార్వటౌన్ షిప్–బి లే అవుట్ చేశారు. అందులోని 617 గజాల ఖళీ పార్కు స్థలాన్ని గతంలోనే పూర్వ పంచాయతీ పేరున మార్ట్‌గేజ్ చేశారు. రూ.6 కోట్ల విలువ చేసే ఈ ఖాళీ స్థలంపై ఓ ముఠా కన్నేసింది. పంచాయతీ పేరున మార్ట్‌గేజ్ చేసిన ప్లాట్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రస్తుత మున్సిపాలిటీ పేరున డాక్యుమెంట్ సృష్టించి, రిజిస్ట్రేషన్‌కు యత్నించింది. ప్రస్తుత ఎస్‌ఆర్‌ఓ గుర్తించి, సంబంధిత మున్సిపల్ అధికారికి సమాచారం ఇవ్వగా విషయం బయటికి వచ్చింది. మున్సిపాలిటీలో లేని ఉద్యోగి పేరున ఫేక్ మార్టిగేజ్ రిలీజ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తేలింది.

అధికారిక ముద్ర!