
ఆడిట్ బృందం ఆకస్మిక తనిఖీలు
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధిలో గురువారం డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆడిటర్ మహ్మద్ ఖాజా బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా పలు వార్డుల్లో చేపడుతున్న రోడ్ల శుభ్రత, వాటర్ ట్యాంకులు, డివైడర్‌లపై మొక్కలు, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల నిర్వహణ, వంటశాలలు, మరుగుదొడ్లు, కంపోస్ట్ యార్డ్‌ల నిర్వహణ, తడి, పొడి చెత్తను వేరుచేయడం, వనమహోత్సవంలో నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశా రు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా కోహెడ ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ కాలుష్యం వంటి అంశాలపై నిర్వహించిన స్వచ్ఛత పోటీల్లో గెలిచిన వారికి మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ వినయ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ సురేష్ పాల్గొన్నారు.
ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆక్రమణల తొలగింపు
హయత్‌నగర్: అబ్దుల్లాపూర్‌మెట్టు మండలం కొహెడలోని తాళ్లకుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను గురువారం ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. సర్వే నంబర్ 883, 886లలో విస్తరించి ఉన్న చెరువు ఎఫ్టీఎల్‌లో రెండు ప్లాట్లలో ప్రహరీలు నిర్మించారు. సమాచారం అందుకున్న ఇరిగేషన్ ఏఈ వంశీ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందితో కలిసి జేసీబీ సాయంతో వాటిని కూల్చివేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టినా, కాలువలను పూడ్చివేసినా చర్యలు తప్పవని అన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ఎంఈఓ ఆఫీసుకు తాళం వేసి ఆందోళన
ఇబ్రహీంపట్నం: మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కార్యాలయానికి కార్మికులు తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ.. ఏడాదిగా బిల్లులు, గౌరవ వేతనం చెల్లించడం లేదని అన్నారు. గుడ్లు, రాగి జావ పెట్టాలని ప్రభుత్వం చెబుతోంది తప్ప అందుకు తగ్గ నిధులు మంజూరు చేయడంలేదన్నారు. అప్పులు చేసి గుడ్లు తీసుకొచ్చి పెడుతున్నప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ఎంఈఓ, ఎస్‌టీఓ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగతున్నా మోక్షం కలగడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎస్‌ఐ నాగరాజు ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి తాళం తీయించారు. ఎస్‌ఎఫ్‌ఐ, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ మున్సిపల్ కన్వీనర్ ఎల్లేశ్, కార్మికులు పాల్గొన్నారు.

ఆడిట్ బృందం ఆకస్మిక తనిఖీలు