సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●:
ఎమ్మెల్సీ రేసులో కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం ముందంజలో ఉన్నారు. నవంబర్‌లో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో ఒకటి ఆయన్ను వరించే అవకాశం మెండుగా కనిపిస్తోంది. సామాజిక సమీకరణలు, సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఆయనకు అనుకూలించే అంశాలు. గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు నవంబర్‌లో ఖాళీ కానున్నాయి. గవర్నర్ కోటా కావడంతో సహజంగానే కాంగ్రెస్ ఖాతాలోకి ఈ మూడు స్థానాలు వెళ్లనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో పోటీ అధికంగానే ఉన్నప్పటికీ, ఎంపికలో సామాజిక సమీకరణలు అత్యంత కీలకం కానున్నాయి. ఇప్పటివరకు ప్రాధాన్యతకు నోచుకోని కులాలకు ఈసారి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని సీఎంతో పాటు, అధిష్టానం చెబుతూ వస్తోంది. ఈ లెక్కన ఎమ్మెల్సీ ఎంపికలో మున్నూరుకాపు సామాజికవర్గానికి తప్పనిసరిగా ఒకటి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పటివరకు మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యం లభించలేదు. మంత్రివర్గంలో కాపులకు చోటులేకపోవడంతో పాటు, పార్టీ పరంగా అవకాశం వచ్చిన రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాపులకు చోటు దక్కలేదు. ఇతర ప్రధాన కులాలైన గౌడ్, ముదిరాజ్, యాదవులకు గతంలో అవకాశం దక్కడంతో ఈ సారి మున్నూరుకాపు, పద్మశాలితో పాటు బ్రాహ్మణ లేదా ఎస్సీలకు మూడు స్థానాలు కేటాయించేందుకు పార్టీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. బ్రాహ్మణ కోటాలో ఇతర జిల్లాల నేతలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండంకు చెందిన హర్కర వేణుగోపాల్ పేరు వినిపిస్తోంది. ఎస్సీ కేటగిరీలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పేరుకూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాకేంద్రంలో పార్టీకి సరైన నేత అవసరమైన నేపథ్యంలో సత్తు మల్లేశంకు ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీవర్గాల్లో ప్రచారం సాగుతోంది.


