బోయినపల్లి(చొప్పదండి): నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకుని జల వనరుల పెంపునకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఉమారాణి పేర్కొన్నారు. మండలంలోని తడగొండ గ్రామ రక్షిత మంచినీటి ట్యాంక్ పరసరాల్లో శుక్రవారం ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ అభిశేక్‌రావు ఆధ్వర్యంలో జల అర్పణ్ దీవస్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ చేపూరి వెంకటేశ్, కార్యదర్శి సుమలత తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలతో బీసీల వెనకబాటు
సిరిసిల్లఅర్బన్: బీసీల వెనకబాటుతనానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలే కారణమని బీఎస్పీ జోన్ ఇన్‌చార్జి నిషాని రామచంద్రం అన్నారు. మాన్యవర్ కాన్షీరామ్ 20వ వర్ధంతి సందర్భంగా ఈనెల 9న ఆదిలాబాద్‌లో నిర్వహించే బహుజన రాజ్యాధికార సంకల్ప సభ పోస్టర్‌ను శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అన్యాయం జరిగిందన్నారు. జనాభా ప్రాతిపాధికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు బీఎస్పీ పనిచేస్తుందన్నారు. జిల్లా నుంచి వేలాది మంది సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఈసీ సభ్యులు ఎనగందుల వెంకన్న, జోన్ ఇన్‌చార్జి దొడ్డే సమ్మయ్య, నాయకులు రమేశ్, మహేశ్, కట్కూరి రమేశ్, అబ్దుల్‌నబీ, బోగ కనుకయ్య, దొబ్బల రాము, శంకర్, బూర మమత, బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
అంకిరెడ్డిపల్లెలో బెల్ట్‌షాపులు బంద్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లె గ్రామ పరిధిలో బెల్ట్‌షాపులను పూర్తిగా మూసివేయాలని గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. శుక్రవారం సర్పంచ్ రాగుల రాజిరెడ్డి అధ్యక్షతన పంచాయతీ ఆవరణలో పాలకవర్గం, గ్రామ పెద్దల సమక్షంలో సమావేశం నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా బెల్ట్‌షాపులు నడిపినా, మద్యం విక్రయించినా రూ.10 వేలు జరి మానా విధిస్తామని సర్పంచ్ హెచ్చరించారు. మద్యం మహమ్మారి వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా, మహిళల రక్షణ, యువత భవిష్యత్, గ్రామంలో శాంతిభద్రతలను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, యువత సహకరించాలని సర్పంచ్ కోరారు.
అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
సిరిసిల్లఅర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ మినీ స్టేడియంలో నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ పోటీలు నిర్వహించినట్లు కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపా రు. అండర్ 14, 16 విభాగాల్లో బాలబాలికలు పాల్గొనగా కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రెటరీ సుమన్ పోటీలను ప్రారంభించారు. ప్రతిభ కనబరిచన 13 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు నవంబర్ 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు వారు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు సుంకటి అజయ్‌కుమార్, బోజ్జ రాజు, కుంట శ్రీనివాస్, శైలజ, అబ్జర్వర్‌లుపాల్గొన్నారు.
17 నుంచి బ్రహ్మోత్సవాలు
సిరిసిల్లటౌన్: శ్రీశాల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 17 నుంచి 27 వరకు జరుగుతాయని ఆలయ ఈవో మా రుతిరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న రోజుల్లో కొబ్బరి ముక్కలు పోగు చేసుకోవడానికి బహిరంగ టెండర్లు ఆహ్వానించారు. రూ.10వేలు డిపాజిట్ సొత్తును జాతీయ బ్యాంకులో డీడీని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం సిరిసిల్ల పేరున తీసి సీల్డ్ టెండర్ ఫారంను అక్టోబర్ 5 నుంచి 6న ఉదయం 10 గంటల్లోపు బాక్సులో వేయాలని కోరారు. అదేరోజు 12 గంటలకు టెండర్ వేలం నిర్వహిస్తామన్నారు.


