గంభీరావుపేట(సిరిసిల్ల): ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ‘దీక్ష’తో ఆన్‌లైన్ విధానంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలోని ప్రతీ ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపాల్ శిక్షణలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంది. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్, రెసిడెన్షియల్, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రీ ప్రైమరీ నుంచి సెకండరీ స్థాయి వరకు పనిచేసే ఉపాధ్యాయులందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
ఆన్‌లైన్‌లో శిక్షణ
పాఠశాలలకు ఉపాధ్యాయులు దూరం కాకుండా ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. గతంలో కోర్సుల్లో సర్టిఫికేషన్ పొందిన వారు మళ్లీ కోర్సు చేయాల్సిన అవసరం లేదు. అయితే వారి సర్టిఫికెట్లను జిల్లా ట్రాకర్‌లో నమోదు చేయాలి. నిష్ట ఎఫ్‌ఎల్‌ఎన్, నిష్ట ఈసీసీఈ, ఏఐ టూల్స్ ఫర్ ఎడ్యుకేషన్, కెరీర్ డెవలప్‌మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్, సైబర్ హైజీన్, యాక్షన్ రీసెర్చ్, ఈ–వేస్ట్, క్యాచ్ ది రెయిన్, డిజిటల్ టూల్స్, ఏఐ ఆధారిత బోధన తదితర కోర్సులను ఉపాధ్యాయులకు ఉత్తర్వుల్లో కేటాయించారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు వేర్వేరుగా కోర్సులు కేటాయించారు. నిష్ట ఎఫ్‌ఎల్‌ఎన్, ఈసీసీఈ కోర్సులు ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ మాధ్యమాల్లోనే అందుబాటులో ఉన్నందున తెలుగు మాధ్యమ ఉపాధ్యాయులు ఇంగ్లిష్ కోర్సులో నమోదు కావాలని సూచించారు.
నివేదికలు సమర్పించాలి
స్మార్ట్ ఫోన్లు లేదా సరైన కనెక్టివిటీ లేని ఉపాధ్యాయుల కోసం పాఠశాల ఐసీటీ ల్యాబ్‌లు, డిజిటల్ తరగతి గదులను వినియోగించనున్నారు.
జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంఈవోలు, పాఠశాల స్థాయిలో హెచ్‌ఎం, ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేశారు. హెచ్‌ఎంలు రోజూ సాయంత్రం 5 గంటల్లోగా పాఠశాల పురోగతిని ఎంఈవోలకు నివేదించాలి. ఎంఈఓలు సాయంత్రం 6 గంటల్లోగా మండల స్థాయి నివేదికను జిల్లా మిషన్ విభాగానికి పంపాలి.
చర్యలు తప్పవు
దీక్ష ప్లాట్‌ఫాం నుంచి నేరుగా కా కుండా యూడైస్ ప్లస్‌లో నమోదైన శిక్షణ వివరాల ఆధారంగా లెక్కించబడుతుందని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో సర్టిఫికెట్లు పొందడమే కాకుండా వాటి వివరాలు యూడైస్ ప్లస్‌లో సరిగా నమోదు చేయడం కీలకంగా మారింది. వంద శాతం నమోదు, సర్టిఫికేషన్ సాధించని పాఠశాలల హెచ్‌ఎంలు మూడు రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. లోటును సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేసి వార్షిక పనితీరు మదింపులో పరిగణనలోకి తీసుకుంటారు. నిబంధనల ఉల్లంఘనను విధుల్లో నిర్లక్ష్యంగా పరిగణించి సర్వీస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.
జిల్లా సమాచారం
(అన్ని మేనేజ్‌మెంట్‌లతో కలిపి)
ఉపాధ్యాయులు 4,379
పాఠశాలలు 655
విద్యార్థులు 83,496
శిక్షణ పూర్తి చేసుకున్నా
దీక్ష శిక్షణలో పాల్గొన్నా. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా సర్టిఫికెట్ కూడా పొందిన. లర్నింగ్ డిజిటల్ టూల్స్ అండ్ ఏఐ టీచింగ్ కోర్సు పూర్తి చేశాను.
– పాతూరి మహేందర్‌రెడ్డి,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు


