డీఎం అవుట్‌ ! | - | Sakshi
Sakshi News home page

డీఎం అవుట్‌ !

Jul 28 2026 2:12 AM | Updated on Jul 28 2026 2:12 AM

● పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ నర్సింహారెడ్డి సరెండర్‌ ● డీసీఎస్‌వోకు జిల్లా మేనేజర్‌గా అదనపు బాధ్యతలు

ధాన్యం కొనుగోల్‌మాల్‌..
● పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ నర్సింహారెడ్డి సరెండర్‌ ● డీసీఎస్‌వోకు జిల్లా మేనేజర్‌గా అదనపు బాధ్యతలు

సిరిసిల్ల: ధాన్యం కొనుగోళ్ల అక్రమాలు కొలిక్కి రావడం లేదు. కంచె చేను మేసిన చందంగా రోజుకో అక్రమం వెలుగుచూస్తోంది. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ నర్సింహారెడ్డిని విధుల నుంచి తప్పిస్తూ.. ఆ శాఖకు సరెండర్‌ చేశారు. అతని స్థానంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అప్పటికే పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ నర్సింహారెడ్డి షోకాజ్‌ నోటీసు అందుకున్నారు. అతను ఇచ్చిన సమాధానంతో జిల్లా ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా అతన్ని సరెండర్‌ చేయగా.. మరిన్ని అవినీతి మరకలు వెలుగులోకి వస్తున్నాయి.

అధికారి బ్యాంకు ఖాతాలోకి రూ.5లక్షలు!

ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న గోదాం ఇన్‌చార్జి ఉత్కం విజయ్‌ ద్వారా జిల్లా స్థాయి అధికారి బ్యాంకు అకౌంట్‌కు రూ.5లక్షలు నెఫ్ట్‌ ద్వారా బదిలీ అయినట్లు సమాచారం. 13 లారీల వడ్లను పక్కదారి పట్టించిన తరువాతే.. ఈ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఆ రూ.5లక్షల్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖ డీఎంను సరెండర్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

అక్రమార్కులే తొలి ఫిర్యాదుదారులు

సిరిసిల్ల అపెరల్‌ పార్క్‌లో 86 బస్తాల ధాన్యం పక్కదారి పట్టాయని తొలుత ఫిర్యాదు చేసిన గోదాం ఇన్‌చార్జి విజయ్‌ 13 లారీల వడ్లు పక్కదారి పట్టేందుకు అసలు సూత్రధారి. ఈ ఘటనలపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ నర్సింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. తాజాగా నిందితుల బ్యాంకు అకౌంట్‌ నుంచి జిల్లా స్థాయి అధికారి ఖాతాకు రూ.5లక్షలు బదిలీ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సదరు అధికారిని సరెండర్‌ చేసినట్లు తెలిసింది. ఫిర్యాదుదారులే అక్రమాల్లో భాగస్వాములైనట్లు సమాచారం. మరికొందరు అధికారులకు భాగస్వామ్యం ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి.

నిందితులకు కండిషన్‌ బెయిల్‌ !

ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్టయిన ఆరుగురికి ఇటీవల కండిషన్‌ బెయిల్‌ మంజూరైంది. జైలు నుంచి వచ్చిన అపెరల్‌ పార్క్‌ గోదాం మేనేజర్‌ ఉత్కం విజయ్‌, వేములవాడరూరల్‌ అచ్చన్నపల్లికి చెందిన వాసాల గణేశ్‌, రుద్రంగి మండలం మానాలకు చెందిన ఐకేపీ ఇన్‌చార్జి గడ్డం స్వామి అలియాస్‌ నర్సిరెడ్డి, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ ఆఫీస్‌లో పనిచేసే కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన కమ్మరి రాజశేఖర్‌, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పీఏసీఎస్‌(సింగిల్‌ విండో) ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి గాజుల నవీన్‌, వేములవాడ చెందిన రైస్‌మిల్లర్‌ చేపూరి మధుకర్‌లకు కండిషన్‌ బెయిల్‌ వచ్చింది. వీరు ప్రతీ శనివారం సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో సంతకాలు చేయాల్సి ఉంది.

సస్పెన్షన్లు.. నోటీసులు..

లైసెన్స్‌ల తొలగింపు

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న ఏడుగురు జైలుకు వెళ్లి బెయిల్‌పై రాగా.. పౌరసరఫరాలశాఖలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి కమ్మరి రాజశేఖర్‌, కోనరావుపేట మండలం మల్కపేట ఐకేపీ సెంటర్‌ బుక్‌కీపర్‌ జంగిటి శ్రీనివాస్‌, ఐకేపీ వీఓఏ పి.పర్శరాములు, రుద్రంగిలో డీసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు గడ్డం నర్సిరెడ్డి, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో పీఏసీఎస్‌ నిర్వాహకుడు గాజుల నవీన్‌, జిల్లా పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి వేణు, కోనరావుపేట ఐకేపీ ఏపీఎం రాజేశంను, సిరిసిల్ల సింగిల్‌విండో సెక్రటరీ బి.నరేశ్‌ను, ఐకేపీ సీసీ శ్రీదేవి, వీర్నపల్లి ఐకేపీ ఏపీఎం దేవరాజులను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సస్పెండ్‌ చేశారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఎల్‌.బుచ్చిబాబు, జిల్లా మేనేజర్‌ నర్సింహారెడ్డి, డీఆర్‌డీవో లక్ష్మీనారాయణ, జిల్లా సహకార అధికారి టి.రామకృష్ణలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని ఆదిత్య లారీ ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసి, బ్లాక్‌ లిస్టులో పెట్టారు. రుద్రంగి మండలం మానాలకు చెందిన గడ్డం స్వామి అలియాస్‌ నర్సారెడ్డికి చెందిన ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రం ఫెర్టిలైజర్‌, సీడ్స్‌ షాపు లైసెన్సులను రద్దు చేశారు. వేములవాడలోని మల్లికార్జున రైస్‌మిల్లు పారిశ్రామిక లైసెన్స్‌ రద్దుకు నోటీసులు జారీ చేశారు. తాజా పరిణామాలతో ధాన్యం కొను‘గోల్‌మాల్‌’ జిల్లా అధికార యంత్రాంగాన్ని కుదిపేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement