అనుమతి పేరిట అక్రమ తవ్వకాలు ఇసుక తవ్వకాలను అడ్డుకున్న రైతులు, గ్రామస్తులు అనుమతులు రద్దు చేయాలని ఆందోళన
కోనరావుపేట(వేములవాడ): అనుమతి మూడెకరాలు తీసుకుంటే.. పది ఎకరాలకు మించి ఇసుక తోడుతున్నారు. మూలవాగు పరిసరాల్లో వ్యవసాయ బావులు, బోరుబావుల్లో నీటి ఊటలు ఇంకిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక క్వారీ పేరిట అనుమతులు ఒక చోట తీసుకొని.. తవ్వకాలు మరో చోట చేపట్టి సహజ వనరులను కాంట్రాక్టర్ దోచుకుంటున్నాడని రైతులు సోమవారం ఆందోళనబాట పట్టారు. ఇసుక వ్యాపారులకు అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపించారు.
గతంలో అనుమతులు రద్దు
కోనరావుపేట మండలం బావుసాయిపేట–మామి డిపల్లి మద్య మూలవాగు ప్రవహిస్తుంది. గతంలో బావుసాయిపేటకు చెందిన సర్వేనంబర్ 83సీలో చీటి అశోక్‌రావుకు చెందిన భూమిలో ఇసుక మేటలు పెట్టాయని వాటిని తొలగించుకునేందుకు అనుమతులు తీసుకున్నారు. అందులోంచి ఇసుకను తరలించగా ఆ సమయంలో అధిక వర్షాలు కురిసి ఆ ప్రాంతం ముంపునకు గురైంది. దీంతో ఆ ప్రాంత రైతులు తమను ఆదుకోవాలంటూ అప్పటి కలెక్టర్‌ను కోరగా ఇసుక రీచ్ అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
3.30 ఎకరాలలో అనుమతి
ఈ యేడాది 3.30 ఎకరాలలో 16వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాల కోసం మే 26న అనుమతులు తీసుకున్నారు. పట్టా భూమిలో కాకుండా మూలవాగులో 10 నుంచి 12 ఎకరాలలో రెండు నెలలుగా తవ్వకాలు చేపడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అనుమతులకు మించి ఇసుక తోడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు.


