● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేయాలని, ఫిర్యాదుదారులపై మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 17 మంది బాధితుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఠాణాల ఎస్‌హెచ్‌వోలతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించేలా చూస్తామన్నారు.
ఆధునిక విధానాలతో అధిక దిగుబడులు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సాంప్రదాయ పద్ధతులు కాకుండా ఆధునిక విధానంలో సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం రైతు విత్తన మేళా నిర్వహించారు. అఫ్జల్ బేగం మాట్లాడుతూ ఆరుతడి పంటల ప్రాధాన్యత గురించి వివరించారు. మండల వ్యవసాయ అధికారి సంజీవ్, సర్పంచ్ మోర లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.
పనిచేసే వారికి గుర్తింపు
వేములవాడ: పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందని ఈవో రమాదేవి పేర్కొన్నారు. రాజన్న ఆలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులను అందజేశారు. పారువెల్లి భానుశర్మ ప్రధాన అర్చకులుగా, కూరగాయల శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్‌గా, మేకల వెంకటేశ్ జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. డీఈవో నవీన్ తదితరులు పాల్గొన్నారు.
29న జావలిన్ డే ఎంపిక పోటీలు
సిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న జావలిన్ డే ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. పట్ట ణంలోని బతుకమ్మఘాట్ వద్ద నిర్వహించే జా వలిన్, పరుగుపందేల ఎంపిక పోటీలకు అండర్–6 నుంచి అండర్–20లోపు మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 7న హనుమకొండలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
30 నుంచి వరుణయాగం
వేములవాడ: భీమన్న ఆలయంలో మూడు రోజులపాటు వరుణయాగం నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి సోమవారం తెలిపారు. ఈనెల 30 నుంచి ఆగస్టు 1 వరకు వరుణయాగాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రాజన్న ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం, భీమేశ్వర ఆలయంలో రుశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ యాగం నిర్వహించనున్నట్లు వివరించారు.
విద్యుత్ సరఫరాలో లోపాలు అధిగమించాలి
సిరిసిల్లటౌన్: విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ టి.మధుసూదన్ సూచించారు. సిరిసిల్లలోని జిల్లా విద్యుత్‌శాఖ సర్కిల్ ఆఫీస్‌లో సోమవారం సమీక్షించారు. రైతులకు ఇస్తున్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులు, ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్లు, కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ ఉపకేంద్రాలు, కొత్త పరిశ్రమలకు సరఫరా చేస్తున్న లైన్లు, కొత్త సర్వీసుల మంజూరుపై ఆరా తీశారు. చీఫ్ ఇంజినీర్ అశోక్, ఎస్‌ఈ వేణుమాధవ్, డీఈలు అంజయ్య, వెంకటరమణ పాల్గొన్నారు.


