వేములవాడ: మంత్రాలు కాదు.. మోసాలే! అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కపట బాబాలు వశీకరణ పేరుతో వల వేస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మికత పేరుతో అమాయక ప్రజలను మోసం చేసే కపట బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ బొంబాయిలో ఉంటూ కొద్ది సంవత్సరాల క్రితం తన మకాంను వేములవాడకు మార్చుకుంది. తనను తాను ఆధ్యాత్మిక శక్తులు కలిగిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటూ బాబా అవతారమెత్తింది. ఓ కుటుంబాన్ని వలలో వేసి రూ.కోట్లు కాజేసిన ఘటన వేములవాడలో కలకలం రేపుతోంది. బాధితుడు చిమ్మల మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య శ్రావణిని ఆ మహిళ మానసికంగా ప్రభావితం చేసి కుటుంబ సభ్యుల నుంచి దూరం చేసే ప్రయత్నం చేసిందన్నారు. భవిష్యత్ కష్టాలు తొలగిస్తానని, ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తానని నమ్మించి దశలవారీగా భారీ మొత్తంలో నగదు, బంగారం, ఆస్తులను తీసుకుందని ఆరోపించారు. మొత్తం రూ.2.14కోట్ల వరకు తమ కుటుంబం నష్టపోయినట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


