సిరిసిల్ల: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతీ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 37 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకుంటూ సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక లాభాలు గడించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని నేరెళ్లలో వానాకాలం పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, శాస్త్రవేత్త టి.అరుణ్‌బాబు కీలక సూచనలు చేశారు. యూరియా తగ్గించాలని, పచ్చిరొట్ట ఎరువులు పెంచాలన్నారు. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పొలాల్లో జనుము, జీలుగతోపాటు జీవన ఎరువులు, సేంద్రీయ ఎరువులను వాడాలని సూచించారు. వరికి బదులుగా పెసర, మినుము, బబ్బెర్లు వంటి పప్పుధాన్యాలు, కుసుమ, పొద్దుతిరుగుడు, ఆముదం, ఆవాలు, సోయాబీన్ వంటి నూనెగింజల పంటలు సాగు చేయాలని వివరించారు. ఏఈవో మౌనిక, నేరెళ్ల సర్పంచ్ పొన్నం లక్ష్మణ్, ఉపసర్పంచ్ రాజమణి, రైతులు పాల్గొన్నారు.
సిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్: ఆశవర్కర్లు శ్రమదోపిడీకి గురవుతున్నారని, పనికి తగిన వేతనం చెల్లించాలని కోరుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాంపు ఆఫీస్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ ఆశవర్కర్లకు రూ.18వేల వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ పనికి తగిన వేతనం చెల్లించాలని, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. అనంతరం కేటీఆర్ ఆఫీస్ ఇన్‌చార్జి గణరాజ్‌కు వినతిపత్రం అందించారు. నాయకులు చంద్రకళ, నిర్మల, లావణ్య, సునంద, రేణుక, లక్ష్మి, రజిత, వాణి, స్వప్న, పద్మ, లలిత, జ్యోతి, రజిని, సుజాత, మమత, రమాదేవి, నీరజ, మానస, బాలలక్ష్మి, గౌతమి పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
వేములవాడ: మున్సిపల్ పాలకవర్గం, ప్రజలు, అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు కోరారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జి.లోకేశ్ సోమవారం మర్యాదపూర్వకంగా చైర్మన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. చైర్మన్ రాజు మాట్లాడుతూ వేములవాడకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తారని, పట్టణ ప్రజలకు శానిటేషన్, తాగునీరు, వీధి దీపాలు వంటి వసతులపై దృష్టి పెట్టాలన్నారు. కమిషనర్ లోకేశ్ మాట్లాడుతూ మున్సిపల్ సేవలను వేగంగా, పారదర్శకంగా అందిస్తామన్నారు.
‘అక్రమంగా మట్టి తరలిస్తే చర్యలు’
రుద్రంగి: అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని రుద్రంగి తహసీల్దార్ పుష్పలత, ఎస్సై మోతీరాంనాయక్ హెచ్చరించారు. మండలంలోని మానాలలోని కొత్త చెరువులో నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 వాహనాలను పట్టుకుని సీజ్ చేశారు. వాహన యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


