● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): జూకీ కుట్టుమిషన్లతో స్వయం ఉపాధి పొంది మహిళలు ఆర్థికంగా ఎ దగాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరుగురికి జూకీ కుట్టు మిషన్లను సోమవారం కలెక్టరేట్‌లో పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మరిన్ని మెలకువలు నేర్చుకుంటూ యూనిఫాంలు, ఆధునిక డిజైన్లతో డ్రెస్సులు కుట్టాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించి
కలెక్టర్ గరీమా అగ్రవాల్ తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్‌టైల్ పార్కులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కొనసాగుతుండగా గతంలో పరిశీలించారు. కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. ఆ సమయంలోనే నిరుపేదలకు కుట్టుమిషన్లు ఇస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈమేరకు రామిడి లక్ష్మి, బత్తిని అశ్విని, పోతూరి లావణ్య, దొరగొల్ల ప్రేమలత, పోతూరి నిర్మల, మంద సుమలతకు జూకీ కుట్టుమిషన్లు అందించారు. చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.సంతోష్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు.
సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి
పిల్లలు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవుల్లో తల్లిదండ్రులకు పనుల్లో సాయం చేస్తూనే, నచ్చిన క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి రజిత, తహసీల్దార్ విజయ ప్రకాశ్‌రావు, ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, సర్పంచ్ గాధగోని సాగర్, సీడీపీవో ఉమారాణి ఉన్నారు.


