సిరిసిల్ల: జిల్లా పరిధిలోని రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఎన్‌పీడీసీఎల్ డిపార్టుమెంట్ ట్రాన్స్‌ఫార్మర్ వాహనాలను అందుబాటులో ఉంచినట్లు సిరిసిల్ల సర్కిల్ ఎస్‌ఈ టి.వేణుమాధవ్ సోమవారం తెలిపారు. జిల్లా పరిధిలో ఏడు వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు సత్వర సహాయం అందించేందుకు ఉపయోగపడతాయన్నారు. ప్రతీ డివిజన్, సబ్‌డివిజన్ పరిధిలో డిపార్టుమెంట్ ట్రాన్స్‌ఫార్మర్ వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిన వెంటనే సంబంధిత అధికారికి తెలియజేస్తే డిపార్టుమెంట్ వాహనం ద్వారానే ట్రాన్స్‌ఫార్మర్‌ను వంద శాతం తరలిస్తామని తెలిపారు. వ్యవసాయ సీజన్‌లలో రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు. ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే 1912కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం దేశాయిపల్లిలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కురిసిన వర్షంతో ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసిన సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో పలువురు రైతులు ధాన్యం తడిసిందని తెలిపారు. ధాన్యంపై పరదాలు కప్పినా గాలికి లేచిపోయాయి.


