సిరిసిల్లటౌన్: భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) ఆవిర్భావ వేడుకలను సోమవారం సిరిసిల్లలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష బంగారు తెలంగాణ సాధించే వరకు పార్టీ కృషి చేస్తుందన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధకుడు కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన ఉంటూ.. సమస్యల సాధనకు పోరాడుతుందని స్పష్టం చేశారు. అనంతరం కొత్త బస్టాండులోని తెలంగాణ తల్లికి పూలమాలలు వేశారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, వైస్‌చైర్మన్ దార్ల సందీప్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీఎస్‌పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు.
వాడవాడల్లో గులాబీ పండుగ
బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని వార్డుల్లో కౌన్సిలర్లు, పార్టీ వార్డు కమిటీల ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న 3వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు.


