సిరిసిల్ల క్రైం: శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిలాకేంద్రంలోని సిక్కువాడలో మంగళవారం తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. సరైనపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేసి 15 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలను అడ్డకోవడం, ప్రజలకు భద్రతాభావం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి రవాణాపై సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీఐ శ్రీనివాస్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


