విశ్రాంత ఉద్యోగులకు దక్కని బకాయిలు
రెండేళ్లుగా ఎదురుచూపులు
జిల్లాలో 500 మంది వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్
కోట్లలో బకాయిపడ్డ ప్రభుత్వం
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రభుత్వ ఉద్యోగం చేసినన్ని రోజులు ఓ భరోసా. రిటైర్‌మెంట్ తర్వాత ప్రతీ నెల పింఛన్ వస్తుందనే ధీమా. అంతేకాకుండా రిటైర్‌మెంట్ సమయంలో వచ్చే బెనిఫిట్స్‌తో చక్కటి ఇల్లు కొనుక్కోవాలని కొందరు.. పిల్లలకు డబ్బులు ఇవ్వాలని మరికొందరు కలలు కంటారు. కానీ రెండేళ్లుగా ఉద్యోగ విరమణ తర్వాత బెనిఫిట్స్ అందక విశ్రాంత ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. తమ జీవితకాలంలో ముప్‌పై నుంచి నలభై ఏళ్లు సేవ చేసి.. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత గ్రాట్యుటీ, పీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ, జీఎఫ్, ఫైనల్ ఈఎల్స్, ఫైనల్ పేమెంట్ అందక ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్లుగా రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి ప్రభుత్వం రూ.50 లక్షల నుంచి రూ.80లక్షల వరకు బకాయి పడింది. ఇలా జిల్లాలో 500 మంది వరకు విశ్రాంత ఉద్యోగులు బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
శాపంగా విరమణ పొడగింపు
ప్రభుత్వం ఉద్యోగికి 58 ఏళ్లు నిండగానే విరమణ ఇస్తుంది. దానిని 61 ఏళ్లకు పెంచింది. దీంతో మూడేళ్లపాటు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు వారు 61 ఏళ్లు పూర్తి చేసుకుని ఉద్యోగ విరమణ పొందడంతో బకాయిల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2024 మార్చి నుంచి ఫిబ్రవరి 2026 వరకు దాదాపు 500 మంది అధికారులు, ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. వీరిలో ఎవరికీ కూడా బకాయిలు రాక ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
విశ్రాంత ఉద్యోగుల రందీ
రెండేళ్లుగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. జీవితాంతం కష్టపడిన దానికి విరమణ తర్వాత వచ్చే బకాయిలపైనే చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కొందరు ఉద్యోగులు ఇంటిని నిర్మించుకోవాలని, మరికొందరు ఆరోగ్యం బాగు చేయించుకోవాలని ఎదురుచూస్తున్నారు. గ్రాట్యుటీ డబ్బులతో కూతురు పెళ్లి చేయాలనుకున్న ఓ స్కూల్ అసిస్టెంట్ ఇంటా పెళ్లి ఆగిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఓ జూనియర్ అసిస్టెంట్ మెరుగైన వైద్యం కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు.
కోర్టు గడప తడితేనే బకాయిలా !
జిల్లాలో విశ్రాంత ఉద్యోగులలో కొందరు బకాయిల కోసం కోర్టును ఆశ్రయించారు. ఉద్యోగుల హక్కు అయిన బకాయిలను భేషరతుగా చెల్లించాలని న్యాయస్థానాలు ఆదేశించడంతో జిల్లాలో 30 మంది వరకు బకాయిలు పొందారు. మరో 50 మంది కోర్టుకు ఇటీవల వెళ్లారు. కోర్టులు ఆదేశించిన బకాయిలు రాని వారు మరోసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేయడంతో మరో 10 మందికి బకాయిలు అందాయి. విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధనకు జిల్లాలో ఓ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీరు ప్రస్తుతం అధికారులు, కోర్టుల వద్దకు వెళ్తూ బకాయిల సాధనలో మునిగిపోయారు.


