పోలీసులమని చెప్పి కారులో తరలింపు | - | Sakshi
Sakshi News home page

పోలీసులమని చెప్పి కారులో తరలింపు

Apr 7 2026 9:13 AM | Updated on Apr 7 2026 9:13 AM

వేములవాడలో వృద్ధ దంపతులపై ఖాకీ ఝులుం

సిద్దిపేటకు తీసుకెళ్లి.. తిరిగి తీసుకొచ్చిన వైనం

వేములవాడలో ఫిర్యాదు చేసిన బాధితులు

సిరిసిల్లక్రైం: వేములవాడలో వృద్ధ దంపతులను పోలీసులమని చెప్పి సోమవారం కారులో తీసుకెళ్లిన సంఘటన సంచలనం రేపింది. బాధితులు వేములవాడకు చెందిన దోర్నాల రమేశ్‌, యశోద దంపతులు తెలిపిన వివరాలు. సోమవారం ఉదయం ఇంట్లోకి వచ్చిన కొందరు వ్యక్తులు తాము సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌ ఠాణా పోలీసులమని చెప్పి.. వెంటనే తీసుకెళ్లాల్సి ఉందని బెదిరింపులకు పాల్పడ్డారు. టిఫిన్‌ తింటామన్న ఒప్పుకోకుండా నంబర్‌ప్లేట్‌ లేని కారులో తీసుకెళ్లారు. చిన్నకోడూర్‌కు తీసుకెళ్తున్నామని చెప్పి సిద్దిపేట ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ‘రెడ్డి’ అనే అధికారి పేరుతో ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ కొడుకు వివాహ విషయంలో కొంత వివాదం ఉంది. కొడుకు, కోడలు ఏడాదిన్నరగా వేర్వేరుగా ఉంటున్నారు. వారి వివాహ సమయంలో ఇచ్చిన బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వాలని లేదంటే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. అయితే వేములవాడలోని ఇంట్లో కొన్ని, బ్యాంకులో కొన్ని ఆభరణాలు ఉన్నాయని చెప్పగా.. వెంటనే ముట్టజెప్పాలని సదరు వ్యక్తులు హుకూం జారీ చేశారు. అక్కడి నుంచి ఏపీ 36 ఏడబ్ల్యూ 1380 అనే వాహనంలో వేములవాడకు తీసుకొచ్చారు. ఇంట్లో, బ్యాంకులో ఉన్న బంగారం తీసుకురావాలని ఒత్తిడి చేశారు.

బంధువులకు సమాచారం ఇవ్వడంతో..

ఇంట్లోకి వచ్చిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్నామని భోజనం చేస్తామన్నాం. అదే సమయంలో బంధువులు, స్థానిక వార్డు కౌన్సిలర్‌ బాలకృష్ణరాజుకు సమాచారం ఇచ్చాం. వారు సకాలంలో వచ్చి పోలీసులం అని బెదిరింపులకు దిగిన వ్యక్తులను నిలదీశారు. అదే సమయంలో చిన్నకోడూర్‌ ఎస్సై నంబర్‌ నుంచి రమేశ్‌కు ఫోన్‌ రావడంతో అక్కడే ఉన్న లాయర్‌ గెంట్యాల భూమేశ్‌ జోక్యం చేసుకోవడంతో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు అదే కారులో వెనుదిరిగారు. జరిగిన ఘటనపై రక్షణ కల్పించాలని కోరుతూ బాధితుడు వేములవాడ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులమని చెప్పి ప్రైవేట్‌ వాహనాల్లో తీసుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement