అకాల వర్షం... అపార నష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం... అపార నష్టం

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

జిల్లాలో వడగండ్ల బీభత్సం

వందలాది ఎకరాల్లో వరికి నష్టం

కోనరావుపేట/ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి: జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పడ్డ వడగండ్ల వాన రైతులకు కడగండ్లే మిగిల్చాయి. పొట్టదశలో ఉన్న వరిపై వడగండ్లు కుప్పలుగా కురవడంతో పంట పాడైంది. పచ్చనిపైరు నేలవాలింది. కోతకు వచ్చిన వరి రాలిపోయింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో దాదాపు 200 ఎకరాల్లోని పంట దాదాపు 90 శాతం రాలిపోయింది.

వీర్నపల్లిలో భారీ నష్టం

వీర్నపల్లి మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వీర్నపల్లి మండలం శాంతినగర్‌, అడవిపదిర, లాల్‌సింగ్‌తండా, వన్‌పల్లి, గర్జనపల్లి, సీతారాంనాయక్‌తండా, ఎర్రగడ్డతండాల్లో వడగండ్ల వానకు వరి పంట పూర్తిగా ధ్వంసమైంది. మండల కేంద్రంలో గాలుల తీవ్రతకు గోడలు కూలి వాహనాలపై పడ్డాయి. బండి శ్రీహరికి చెందిన ఆటో, మైపాల్‌కు చెందిన కారు ధ్వంసమయ్యాయి. వీర్నపల్లి సర్పంచ్‌ మల్లారపు జ్యోత్స్న, ఉప సర్పంచ్‌ జక్కుల నరేశ్‌ ఇతర గ్రామాల సర్పంచులతో కలిసి జేసీబీ సాయంతో రోడ్లపై పడిన చెట్లను తొలగింపజేశారు.

పంటలు పరిశీలించిన అధికారులు

వడగండ్ల వానకు నష్టపోయిన పంట పొలాలను వీర్నపల్లి ఏఈవో ఫజిలుద్దీన్‌, గర్జనపల్లి ఏఈవో రమణారావు పరిశీలించారు. గర్జనపల్లి, ఎర్రగడ్డతండా, రంగంపేట, శాంతినగర్‌, లాల్‌సింగ్‌తండాల్లో వివరాలు సేకరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం మండలంలో 350 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

రైతులను ఆదుకోవాలి

మరిమడ్లలో వడగండ్ల వానతో నష్టోపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి కడారి రాములు కోరారు. పంట పొలాలను ఆదివారం పరిశీలించారు. సగ్గుపట్ల దేవయ్య, పడగొల్ల మల్లేశం, భీమాశంకర్‌, భగవాన్‌రెడ్డి, డప్పుల అశోక్‌, డప్పుల రాజయ్య, డప్పుల అనిల్‌ ఉన్నారు.

రైతులను ఆదుకుంటాం

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని విప్‌ ఆది శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు. కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌, తహసీల్దార్‌ వరలక్ష్మి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఫిరోజ్‌పాషా, మాజీ జెడ్పీటీసీ బండ నర్సయ్య, నాయకులు కర్రోళ్ల భాస్కర్‌, మల్లేశం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement