అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

Mar 22 2026 7:22 AM | Updated on Mar 22 2026 7:22 AM

దుబాయ్‌ వెళ్లినా తీరని కష్టాలు

అసంపూర్తిగా ఇందిరమ్మ ఇల్లు

వీర్నపల్లి మండలం శాంతినగర్‌లో విషాదం

వీర్నపల్లి(సిరిసిల్ల): అప్పులు కుప్పలుగా మారి తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ అన్నదాత ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో భార్య, ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన గుగులోత్‌ గోపాల్‌(40) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగులో నష్టాలు రావడంతో అప్పులు పెరిగిపోయాయి. ఆ అప్పులు తీర్చేందుకు దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఉపాధి లభించకపోవడంతో ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు తోడై గుదిబండలా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ప్రభుత్వం మంజూరుచేసిన ఇందిరమ్మ ఇంటి పనులు మొదలుపెట్టాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, ప్రభుత్వం నుంచి బిల్లులు సరిగ్గా రాకపోవడంతో ఆ పనులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఒకవైపు అప్పుల ఒత్తిడి, మరోవైపు గూడు లేని వేదనతో గోపాల్‌ శనివారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రోడ్డున పడ్డ కుటుంబం

గోపాల్‌ మరణంతో అతని భార్య నిర్మలతోపాటు ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. పెద్ద కుమార్తె సరస్వతి ఇంటర్‌ సెకండియర్‌, రెండో కుమార్తె శిరీష పదో తరగతి, కుమారుడు జగ్గు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

లారీ ఢీకొని చిన్నారి మృతి

శంకరపట్నం: మండలంలోని కేశవపట్నంలో శనివారం రాత్రి లారీ ఢీకొని నిత్య(3) మృతి చెందింది. కేశవపట్నం అంబేద్కర్‌ చౌరస్తాలో రోడ్డు పక్కన కత్తులు, కొడవళ్లు, తయారు చేసే శ్రావణ్‌–పంచబూలకు నలుగురు కూతుళ్లు. మూడో కూతురు నిత్య రోడ్డు దాటుతుండగా కరీంనగర్‌ నుంచి హుజురాబాద్‌ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నిత్య అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాదాణానికి కారణమైన లారీని డ్రైవర్‌ ఆపకుండా పరారయ్యారు. కేశవపట్నం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement